Native Async

కృష్ణా నదిపై హై లెవెల్ వంతెనతో దీవుల్లోని గ్రామాలు అనుసంధానం – ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Deputy CM Pawan Kalyan Announces High-Level Bridge on Krishna River to Connect Island Villages
Spread the love

ఈరోజు ఉదయం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో కృష్ణా జిల్లా, అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పంట నష్టం అంచనాలు, నియోజకవర్గ అభివృద్ధి తదితర అంశాలపై మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారు, శాసన సభ్యులు శ్రీ మండలి బుద్దప్రసాద్ గారు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “మొంథా తుపాను కారణంగా రాష్ట్రవ్యాప్తంగా తీర ప్రాంత గ్రామాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. గత వారం అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలో పర్యటించి దెబ్బతిన్న పంటలను పరిశీలించిన సమయంలో నష్టపోయిన వారిలో కౌలు రైతులు కూడా ఉన్న విషయం నా దృష్టికి వచ్చింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పంట నష్టం అంచనాలు త్వరితగతిన పూర్తి చేయడంతోపాటు కౌలు రైతులకు కూడా న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి. ఒక్క కృష్ణా జిల్లాలోనే 60 వేల మందికి పైగా సీసీఆర్సీ కార్డులు కలిగిన కౌలు రైతులు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. నమోదు చేసుకోని కౌలు రైతుల సంఖ్య కూడా ఉంటుంది. నష్టపోయిన ప్రతి కౌలు రైతుని గుర్తించి వారికి ఇబ్బందులు కలగకుండా యంత్రాంగం చర్యలు తీసుకోవాలన్నారు.

  • గత ప్రభుత్వం నిర్లక్ష్యం ఖరీదు రూ.50 కోట్లు:
    అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని తీర ప్రాంతంలో కాలువలను సముద్రానికి అనుసంధానిస్తూ నిర్మించిన అవుట్ ఫాల్ స్లూయిజ్ లు పని చేయకపోవడం కారణంగా నాగాయలంక, కోడూరు మండలాల పరిధిలో సుమారు 5 వేల ఎకరాలు ముంపుకు గురవుతున్న విషయం మా దృష్టికి వచ్చింది. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇవి పూర్తిగా పని చేయకుండాపోయాయి. గ్రీజ్ పెట్టడం వంటి కనీస నిర్వహణ పనులకు కూడా నోచుకోలేదు. ఫలితంగా అవుట్ ఫాల్ స్లూయిజ్ లు మొరాయించడం వల్ల సముద్రం పోటెత్తిన ప్రతిసారి ఉప్పు నీరు తమ పొలాలను ముంచెత్తుతుందని తమ సమస్యకు పరిష్కారం చూపమని దివిసీమ రైతులు కోరుతున్నారు.

గత పాలకుల నిర్లక్ష్యం వల్ల నేడు అవుట్ ఫాల్ స్లూయిజ్ లను పునరుద్ధరించేందుకు రూ.50 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలో మొత్తం ఏడు అవుట్ ఫాల్ స్లూయిజ్ లు పునర్నిర్మాణం చేపట్టాల్సి ఉంది. జాతీయ విపత్తుల నిర్వహణ నిధుల నుంచి వీటికి కేటాయింపులు చేసి నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. అవుట్ ఫాల్ స్లూయిజ్ ల సమస్య పరిష్కారానికి అవసరం అయితే ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలతో మాట్లాడుతా. నూతనంగా నిర్మించబోయే అవుట్ ఫాల్ స్లూయిజ్ లు దీర్ఘకాలం రైతులకు ఉపయోగపడే విధంగా డిజైన్లు పక్కాగా రూపొందించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి.

  • ఎదురుమొండి దీవుల వాసుల కల నెరవేరుస్తాం:
    ఎదురుమొండి దీవుల్లో నివాసం ఉంటున్న 20 వేల మంది ప్రజల చిరకాల వాంఛ ఏటిమొగ – ఎదురుమొండి బ్రిడ్జి నిర్మాణానికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తాం. కృష్ణా నదిపై నిర్మించతలపెట్టిన ఈ హైలెవల్ బ్రిడ్జ్ కోసం ఇప్పటికే రూ.109 కోట్ల నాబార్డు నిధులు మంజూరయ్యాయి. అలైన్మెంట్ లో మార్పుల కారణంగా నిర్మాణ వ్యయం పెరిగిన విషయాన్ని స్థానిక శాసన సభ్యులు తెలియచేశారు. రూ.60 కోట్లు వరకూ నిర్మాణ వ్యయం పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతోపాటు సాస్కీ పథకంతో నుంచీ తగిన నిధులు సమకూరుస్తాము. నిర్ణీత కాల వ్యవధిలో ఏటిమొగ – ఎదురుమొండి హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తాం.
  • అటవీ అనుమతుల ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలి:
    ఎదురుమొండి దీవుల పరిధిలో ఎదురుమొండి – గొల్లమంద మధ్య రహదారి నిర్మాణానికి పంచాయతీరాజ్ శాఖ నుంచి రూ.13.88 కోట్లు కేటాయించాము. ఈ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయ్యింది. అయితే ఈ రోడ్డులో కొంత భాగం అటవీ శాఖకు చెందిన భూభాగం ఉంది. నాచుగుంటకు వెళ్లే రహదారి నిర్మాణం కూడా కొంత భాగం అటవీ శాఖ అనుమతుల కోసం నిలిచిపోయింది. అటవీ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ సంయుక్తంగా క్షేత్ర స్థాయిలో పరిస్థితులను పరిశీలించి సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలి.

కృష్ణా నది సముద్రంలో కలిసే హంసలదీవి పవిత్ర సాగర సంగమ ప్రాంతానికి ప్రజలు వెళ్లేందుకు అటవీ శాఖ కొంత రుసుము వసూలు చేస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. హిందువులంతా ఈ ప్రాంతాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. వసూలు చేస్తున్న రుసుము తక్కువే అయినప్పటికీ భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి అటవీశాఖ అధికారులు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలి” అన్నారు.

ఈ సమావేశంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ కృష్ణబాబు, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శ్రీ కృష్ణతేజ, కృష్ణా జిల్లా కలెక్టర్ శ్రీ డి.కె.బాలాజీ, నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీర్, జిల్లా అటవీశాఖ అధికారులు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit