ఏలూరు జిల్లా పర్యటనలో భాగంగా ఐ.ఎస్. జగన్నాథపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన మ్యాజిక్ డ్రెయిన్ ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. డ్రెయిన్ నిర్మాణంలో ఎన్ని పొరలు ఉంటాయి? ఎంత లోతులో నిర్మించారు? తదితర వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.
డ్రెయిన్ ను ఆనుకుని ఉన్న ఇంటి నుంచి ఒక బిందె నీటిని వంపి పని తీరుని పరిశీలించారు. రూ. 77,173 నిర్మాణ వ్యయంతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా కేవలం మూడు రోజుల్లో ఈ డ్రెయిన్ నిర్మాణం పూర్తి చేసినట్టు అధికారులు తెలియజేశారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పల్లెల్లో మురుగు నీటి నిర్వహణ మెరుగుపర్చేందుకు ఈ మ్యాజిక్ డ్రెయిన్ వ్యవస్థను తీసుకువచ్చారు. మలి విడత పైలెట్ ప్రాజెక్ట్ లో భాగంగా ఐ.ఎస్.జగన్నాథపురంలో నిర్మించిన మ్యాజిక్ డ్రెయిన్ ను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పని తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మిగతా గ్రామాల్లో కూడా దశలవారీగా అమలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
మ్యాజిక్ డ్రెయిన్ — ముఖ్యాంశాలు:
•మురుగునీటి సమస్యలకు తక్కువ ఖర్చుతో మెరుగైన పరిష్కారం.
•దుర్వాసనలు, దోమల పెరుగుదల, కాలుష్యం, రోడ్లపై నీరు నిల్వ — ఇవన్నీ తగ్గించే వ్యవస్థ.
•సిమెంట్ డ్రెయిన్ 1 కి.మీ. ఖర్చు: రూ.50 లక్షలు; మ్యాజిక్ డ్రెయిన్ 1 కి.మీ. ఖర్చు: రూ.7.5 లక్షలు మాత్రమే
•మూడు పొరల ఫిల్టర్ వ్యవస్థ (3 different sizes of stones).
•ప్రతి 50 మీటర్లకు ఒక సోక్ పిట్ ఏర్పాటు.
•మురుగునీరు భూమిలో ఇంకిపోయి భూగర్భ జలాల మట్టం పెరుగుతుంది.
•భారీ వర్షాల్లో రోడ్లపై నీరు నిల్వ కాకుండా రక్షణ కల్పిస్తుంది.
•నందిగామ (సోమవరం) పైలట్ ప్రాజెక్ట్ విజయం సాధించింది.
•ఫలితాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా 106 గ్రామాల్లో అమలు.
•పుణ్యక్షేత్రం కావడంతో ఐ.ఎస్. జగన్నాథపురంలో పనులు ప్రాధాన్యంగా చేపట్టడం జరిగింది.
•ద్వారక తిరుమల మండలంలోని అన్ని గ్రామాల్లో కూడా అమలు జరుగుతోంది.