పిఠాపురంలో రూల్స్ కచ్చితంగా అమలు కావాలి – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Rules Must Be Strictly Implemented in Pithapuram: Deputy CM Pawan Kalyan | Model Pithapuram Master Plan

· ఏ అంశంలో అయినా రూల్ బుక్కు మాత్రమే మాట్లాడాలి
· అధికారుల విధి నిర్వహణలో ఎలాంటి జోక్యాలు ఉండవు
· పాలన వ్యవహారాల్లో అధికారులు జవాబుదారీతనంతో వ్యవహరించాలి
· ‘మోడల్ పిఠాపురం’ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయండి
· పిఠాపురం అభివృద్ది ప్రతి నియోజకవర్గానికి దిక్సూచి కావాలి
· పిఠాపురంలో క్షేత్ర స్థాయి పర్యటన అనంతరం అధికారులతో సమీక్ష సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

‘పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎన్నికల సమయంలో ప్రజలకు మాటిచ్చాను. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. నిర్ణీత వ్యవధిలో అందుకు సంబంధించి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాల’ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. పిఠాపురాన్ని స్వచ్ఛ, సుందర పిఠాపురంగా మార్చాలి.. నిధులకు కొరత రాకుండా నేను చూసుకుంటాను అన్నారు. పనుల్లో జాప్యం లేకుండా అధికారులు చూసుకోవాలన్నారు.

అధికారుల విధి నిర్వహణలో ఎవరి జోక్యం ఉండదు.. అధికారులను ఎవరూ ఇబ్బందిపెట్టరు.. పాలనా వ్యవహారాల్లో రాజకీయ ప్రమేయం అసలు ఉండదని చెప్పారు. ప్రతి అడుగులో నేను జవాబుదారీతనంతో ఉంటాను. పరిపాలనా వ్యవహారాల్లో అధికారులు జవాబుదారీతనంతో వ్యవహరించాలని సూచించారు. ప్రతి ఒక్కరు నిబంధనలకు లోబడి మాత్రమే పని చేయాలని తెలిపారు.

శుక్రవారం మధ్యాహ్నం పిఠాపురం నియోజకవర్గం కేంద్రంలోని రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఉన్న మోహన్ నగర్, ఇందిరా నగర్ ముంపు ప్రాంతాలను పరిశీలించారు. అపరిశుభ్రత, డ్రెయిన్లు, కాలువలపై ఆక్రమణలు చూసి.. పారిశుధ్య నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆర్ అండ్ బి అతిథి గృహంలో రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారితో కలిసి జిల్లా ఇంచార్జి కలెక్టర్, ఇతర అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “పిఠాపురం ఆధ్యాత్మిక వారసత్వం కలిగిన పర్యాటక ప్రదేశం. మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల నుంచి ఇక్కడ శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి దర్శనానికి భక్తులు వస్తారు. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక్కటైన పురూహుతికా అమ్మవారి దర్శనానికీ నిత్యం భక్తులు వస్తూనే ఉంటారు. నియోజకవర్గంలో అడుగుపెట్టిన వారికి పచ్చని చెట్లతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణం స్వాగతం పలకాలి. పిఠాపురం వచ్చిన వారికి ప్రత్యేకమైన అనుభూతి కలగాలి. ముందుగా ప్రధాన రహదారిని అందంగా ముస్తాబు చేయాలి. అందుకు అవసరం అయిన ప్రణాళికలు యుద్ధప్రాతిపదికన సిద్ధం చేయాలి. ఇక్కడ జరిగే అభివృద్ధి అన్ని నియోజకవర్గాలకు దిక్సూచి కావాలి.

· ప్రతీ నెలా ప్రగతి నివేదిక కావాలి:
పిఠాపురంలో డ్రెయిన్లు తెరిచి ఉన్నాయి. పరిసరాలు పరిశుభ్రంగా లేవని యానాదుల కాలనీవాసుల నుంచి ఫిర్యాదు వచ్చింది. డ్రెయినేజీ వ్యవస్థ ఇబ్బందిగా ఉందని ప్రజలు చెబుతున్నారు. డ్రెయిన్లు, పంట కాలువల్లో తక్షణం పూడిక తీత పనులు చేపట్టండి. నియోజకవర్గ పరిధిలో ఎక్కడా చెత్త కనబడకూడదు. అందుకోసం తక్షణ ప్రణాళికలు అమలు చేయాలి. నియోజకవర్గం మొత్తం అండర్ గ్రౌండ్ డ్రెయినేజ్ లు అవసరం ఉంది. సీవేజ్ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి అనువైన ప్రదేశాలు గుర్తించండి. పట్టణంలో ప్రధాన రహదారికి డివైడింగ్ లైన్లు వేయండి. అవసరమైతే మాస్టర్ ప్లాన్ రూపొందించేందుకు ప్రయివేటు కన్సల్టెన్సీల సాయం తీసుకోండి. జనాభా ప్రతిపదికన నియోజకవర్గానికి ఎన్ని పార్కులు అవసరం, వాటిని ఏర్పాటు చేయడానికి అనువైన ప్రదేశాలు గుర్తించి ఒక నివేదిక రూపొందించండి. నియోజకవర్గ అభివృద్ధిలో నెలవారి ప్రగతి స్పష్టంగా కనబడాలి.

కోనో కార్పస్ చెట్ల స్థానంలో స్వదేశీ జాతి చెట్ల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఖాళీ ప్రదేశాల్లో సామాజిక వనాలను అభివృద్ధి చేయండి. మియావకీ ప్లాంటేషన్ పై ప్రజల్లో అవగాహన కల్పించండి. మోహన్ నగర్, రైల్వే ట్రాక్ ప్రాంతాల్లో బహిరంగ మలవిసర్జన సమస్య ఉంది. దీని మూలంగా అనారోగ్య సమస్యలు వస్తాయి. అవసరం అయితే సామూహిక మరుగుదొడ్లు నిర్మించి, ప్రజలకు అవగాహన కల్పించండి.

· పిఠాపురం నుంచి మార్పు మొదలుకావాలి:
బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాల ఏర్పాటు వ్యవహారంలో సుప్రీం కోర్టు ఆదేశాలను అమలు చేయండి. ధ్వని కాలుష్యంపై దృష్టి సారించండి. మతపరమైన వేడుకలు నిర్వహించుకునే సమయంలో కూడా నిబంధనల మేరకే సౌండ్ పెట్టేలా చూడాలి. అన్ని మతాలకీ ఒకటే రూల్ అమలు చేయాలి. లా అండ్ ఆర్డర్ అమలు వ్యవహారంలో రాజీ పడవద్దు. పిఠాపురంలో ప్రతి అధికారి రూల్స్ మాత్రమే ఫాలో అవ్వాలి. ఎవరు ఏం అడిగినా రూల్స్ బుక్ మాత్రమే మాట్లాడాలి. పిఠాపురం నుంచే ఆ మార్పు ప్రారంభం కావాలి” అన్నారు. సమీక్షా సమావేశంలో జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ శ్రీ అపూర్వ భరత్, పడా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసరావు, పిఠాపురం మున్సిపల్ కమిషనర్ శ్రీ కనకారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *