రష్యా భారత్ మధ్య వాణిజ్యం కొనసాగుతుందని, ఎవరు ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా భారత్ తలొగ్గదని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు. మాస్కోతో ఇంధన వాణిజ్యాన్ని తగ్గించుకోవాలని ట్రంప్ ఇతర దేశాలపై ఒత్తిడి తేవడం సరికాదని, దాని వలన వాషింగ్టన్‌కు పెద్ద ప్రమాదమని హెచ్చరించారు.
రష్యా భాగస్వాములపై అధిక సుంకాలు విధిస్తే… ప్రపంచంలో ఇంధన ధరలపై ప్రభావం చూపుతుందని, తద్వారా అమెరికాకు భారీ ఎత్తున ఇబ్బందులు తలెత్తుతాయని హెచ్చరించారు. యూఎస్ ఫెడరల్ వడ్డీరేట్లు పెంచాల్సి వస్తుందని, అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని అన్నారు.
అమెరికా సుంకాలు విధిస్తే… రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఆయిల్‌తో సమతుల్యం చేస్తుందని అన్నారు. భారత్‌కు వాణిజ్య ఇబ్బందులు తలెత్తవని, భారత్‌కు తాము అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నామని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ విభాగంలో తాము భారత్‌కు అండగా ఉంటామని, వ్యవసాయ, ఔషధ ఉత్పత్తులను భారత్ నుంచి కొనుగోలు చేస్తామని పుతిన్ తెలిపారు.
అమెరికాకు తాము పెద్ద సంఖ్యలో యూరేనియంను సరఫరా చేస్తున్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలియజేశారు. రాబోయే రోజుల్లో భారత్ రష్యాల మైత్రి మరింత బలోపేతం అవుతుందని, తాను డిసెంబర్‌లో భారత్‌లో పర్యటిస్తున్నట్టు తెలిపారు. భారత్ పర్యటన తరువాత రెండు దేశాల మధ్య మైత్రి మరింత బలోపేతం అవుతుందని అన్నారు.