రాజీవ్ రహదారి విస్తరణపై ఆందోళన వ్యక్తం చేస్తూ జేఏసీ ప్రతినిధులు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రతినిధులు ఆయనకు పలు ప్రధానమైన వినతులను సమర్పించారు.
ముఖ్యంగా, ప్రతినిధులు ప్రభుత్వం ప్రతిపాదించిన రోడ్డు విస్తరణను 200 అడుగుల నుంచి 100–120 అడుగులకు తగ్గించేలా ముఖ్యమంత్రికి ఈ అంశాన్ని తీసుకెళ్లాలని అభ్యర్థించారు. అదేవిధంగా, హకీంపేట్ వద్ద మొదలయ్యే ఎలివేటెడ్ కారిడార్‌ను ఓఆర్ఆర్ (తుంకుంట ఎగ్జిట్) వరకు పొడిగించమని విజ్ఞప్తి చేశారు. ఈ మార్పుతో అనేక మంది చిన్న వ్యాపారులు జీవనోపాధిని కొనసాగించగలరని వారు వివరించారు.
అలాగే, ఆల్వాల్ సత్య అపార్ట్‌మెంట్స్ ఎదురుగా ఉన్న ప్రాంతంలో రహదారి సరళి (alignment)లో చిన్న సవరణ చేయాలని కూడా సూచించారు.
ఎంపీ ఈటల రాజేందర్ గారు ప్రతినిధుల వినతిని శ్రద్ధగా విని వెంటనే హెచ్‌ఎండిఏ కమిషనర్‌ను ఫోన్‌లో సంప్రదించి రాజీవ్ రహదారి విస్తరణ ప్రాజెక్టు వివరాలను చర్చించారు. ప్రజల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటానని, రహదారి విస్తరణలో ఆస్తి యజమానులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో జేఏసీ చైర్మన్ తెలుకుంట సతీష్ గుప్తా, సుబాష్ గౌడ్, విద్యాసాగర్, సూర్యప్రకాశ్ రెడ్డి, డాక్టర్ సుధాకర్, కల్కి శ్రీనివాస్, కె. వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ గారి సానుకూల స్పందనతో రాజీవ్ రహదారి ప్రాపర్టీ యజమానులు కొంత ఊరట చెందారు. రాబోయే రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందనే నమ్మకం వ్యక్తమవుతోంది.