అస్సాం రాష్ట్రంలోని రాణి ప్రాంతంలోని వల్చర్ కన్జర్వేషన్ అండ్ బ్రీడింగ్ సెంటర్ (VCBC) భారతదేశంలో గద్దల సంరక్షణకు ప్రధాన కేంద్రంగా నిలుస్తోంది. ఈ కార్యక్రమం భాగంగా 30 వైట్–రంప్డ్ గద్దలు (తెల్ల నడుము గద్దలు), 5 స్లెండర్–బిల్డ్ గద్దలు (సన్నని మొఖపు గద్దలు) విజయవంతంగా పెంచి, కాజిరంగా నేషనల్ పార్క్ ఆరో అదనపు ప్రాంతంలో విడుదల చేశారు.
ఒకప్పుడు భారతదేశంలోని పర్యావరణ సమతౌల్యంలో కీలక పాత్ర పోషించిన గద్దలు, పశువైద్యాలలో వాడిన డైక్లోఫెనాక్ ఔషధం కారణంగా భారీగా తగ్గిపోయాయి. తీవ్ర ప్రమాదంలో ఉన్న ఈ జాతుల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం, అటవీశాఖ, వన్యప్రాణి ప్రాధికార సంస్థలు మరియు పర్యావరణ నిపుణులు కలిసి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
ఈ విడుదల కార్యక్రమం గద్దల సంరక్షణలో ఒక మైలురాయిగా నిలిచింది. గద్దలు ప్రకృతిలో “నేచర్ క్లీనర్స్”గా వ్యవహరిస్తాయి. అవి చనిపోయిన జంతువులను తినడం ద్వారా వ్యాధుల వ్యాప్తిని నియంత్రిస్తాయి. అందుకే వీటిని “మన ఆరోగ్య రక్షకులు”గా పరిగణిస్తారు.
రామాయణంలోని జటాయువు ధర్మాన్ని కాపాడినట్లే, ఈ గద్దలు కూడా ప్రకృతి సమతౌల్యాన్ని కాపాడే యోధుల్లా మళ్లీ ఆకాశంలోకి ఎగురుతున్నాయి. ఈ విడుదలతో భారత్‌లో గద్దల పునరుద్ధరణకు మరింత బలం చేకూరింది.