సూపర్ సిక్స్ విజయోత్సవ సభ ఈరోజు రాయలసీమలోని అనంతపురంలో జరగనున్నది. దీనిపై ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. సూపర్ సిక్స్ సూపర్ ప్లాప్ అయ్యాయని అన్నారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని కూటమి ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటని వైఎస్ షర్మిల దుయ్యబట్టారు. హామీలు అమలు చేశామని అప్పుడే సక్సెస్ సభలు జరపడం హాస్యస్పదం అని పేర్కొన్నారు. సూపర్ సిక్స్ హామీల్లో ఒక్కటైనా పూర్తిగా అమలు చేశారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 50 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని, ఒక్కరికైనా 3వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చారా అని ప్రశ్నించారు. హామీల్లో ఇచ్చిన 20 వేల ఉద్యోగాలు ఎక్కడికి పోయాయని అన్నారు. కేవలం అగ్రిమెంట్లు మాత్రమే చేసుకుంటే సరిపోదని, ఉద్యోగాలు రావాలంటే పరిశ్రమలు ఏర్పాటు కావాలని అన్నారు. భృతి ఇవ్వకుండా, ఉద్యోగాలు ఇవ్వకుండా సూపర్ సిక్స్ ఎలా సూపర్ హిట్ అయిందని అన్నారు.
18 ఏళ్లు నిండిని ప్రతి మహిళకు నెలకు 1500 ఆర్థిక సహాయం అనేది సూపర్ సిక్స్‌లో ఇచ్చిన ఒక హామీ అని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల కాలంలో ఒక్క మహిళకైనా 1500 ఇచ్చారా అని ప్రశ్నించారు. అన్నదాత సుఖీభవ కింత సొంతంగా 20 వేల రూపాయలు ఇస్తామని చెప్పారని, కానీ, ఇప్పుడు ఆ మాట మార్చి, కేంద్రం ఇచ్చే ఆరువేల రూపాయలతో లింక్ పెట్టారని అన్నారు. కేవలం 44 లక్షల మంది రైతులకు ఒక విడత 7 వేల రూపాయలు మాత్రమే ఇచ్చి 30 లక్షల మంది రైతులకు పథకం దక్కుండా చేశారని అన్నారు. హామీల్లో సగానికి పైగా కోత పెడితే సూపర్ హిట్ ఎలా అవుతుందని అన్నారు.
తల్లికి వందనం పథకం కింద 87 లక్షల మంది బిడ్డలు ఉంటే కేవలం 67 లక్షల మందికి మాత్రమే 13 వేలు ఇచ్చి, 20 లక్షల మందికి ఇవ్వక పోవడం విచిత్రంగా ఉందని అన్నారు. మూడు సిలీండర్లు ఎంత మందికి ఇచ్చారో ఇప్పటి వరకు తెలియదని అన్నారు. హామీ ఇచ్చిన 14 నెలల తరువాత ఫ్రీబస్సును అమలు చేసి సూపర్ హిట్ అని చెప్పుకుంటున్నారని, గోరింత చేసి కొండంత చేసినట్టు చెప్పుకోవడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని అన్నారు. ప్రతి ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్, బీసీలు, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్ సౌకర్యం అని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడేం చేసిందని అన్నారు. సబ్సిడీ కింద వ్యవసాయానికి సాయం, ధరల స్థిరీకరణ, ఇల్లులేని పేదలకు 2 నుంచి 3 సెంట్లు భూమి ఇస్తామని చెప్పారని వాటిని ఇప్పటి వరకు అమలు చేయలేదని అన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయని, వీటికి చంద్రబాబు ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు.