తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ నేతృత్వంలోని ద్రావిడ మున్నేట్ర కజగం (DMK) ప్రభుత్వం ఈ వారం అసెంబ్లీలో ఒక కీలక బిల్లును ప్రవేశపెట్టేందుకు సన్నద్ధమవుతోంది. ఈ బిల్లుతో రాష్ట్రంలోని హిందీ సినిమాలు, హిందీ పాటలు, హిందీ హోర్డింగ్స్, ప్రకటనలను ప్రజా ప్రదేశాలలో పూర్తిగా నిషేధించాలనే ప్రతిపాదనకు సిద్ధమౌతున్నది. ఈ చట్టం లక్ష్యం…తమిళ భాషను “వేరే భాషల ఆధిపత్యం” నుండి కాపాడటం, తమిళ సాంస్కృతిక గుర్తింపును కాపాడటం అని ప్రభుత్వం పేర్కొంటోంది.
భారత రాజ్యాంగం రాష్ట్రాలకు తమ ప్రాంతీయ భాషలను ప్రోత్సహించే హక్కును ఇచ్చిన నేపథ్యంలో, DMK ఈ బిల్లును రాజ్యాంగపరంగా సమర్థించగలదని వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి స్టాలిన్ మాటల్లో చెప్పాలంటే…“తమిళం మన ప్రాణం. హిందీ లేదా మరే ఇతర భాషను బలవంతంగా మోపడం తమిళ గౌరవానికి విరుద్ధం.”
ఇక, ఈ బిల్లుతో తమిళనాడులో మళ్లీ ఒకసారి భాషా రాజకీయాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చరిత్రపరంగా చూస్తే, తమిళనాడు ఎప్పటి నుంచో హిందీ వ్యతిరేక ఉద్యమాల కేంద్రంగా నిలిచింది. 1960లలో హిందీని జాతీయ భాషగా చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాలు జరిగి, చివరికి కేంద్రం వెనక్కు తగ్గింది. ఆ ధోరణినే ఇప్పుడు DMK ప్రభుత్వం మరలా ప్రదర్శిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
అయితే, భారతీయ జనతా పార్టీ (BJP) ఈ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించింది. బీజేపీ నేతలు ఈ బిల్లును “దేశ ఐక్యతకు ముప్పు”గా పేర్కొంటూ, భారతదేశం ఒకే దేశమని, భాష ఆధారంగా ప్రజల మధ్య భేదాలను పెంచడం దేశహితానికి విరుద్ధమని పేర్కొన్నారు. మరోవైపు, DMK, ఇతర ద్రావిడ పార్టీల మద్దతుదారులు ఈ చర్యను తమిళ సంస్కృతిని, భాషను కాపాడటానికి అవసరమని సమర్థిస్తున్నారు.
సాంస్కృతిక వర్గాల దృష్టిలో, ఈ బిల్లు కేవలం భాషా రక్షణకే కాకుండా, తమిళ యువతలో స్థానిక భాషపై గౌరవాన్ని పెంచే ప్రయత్నంగా కనిపిస్తోంది. “హిందీ సినిమాలు, పాటలు తక్కువ చేయడం ద్వారా తమిళ కంటెంట్‌కి ప్రాధాన్యం పెరుగుతుంది, స్థానిక కళాకారులకు అవకాశాలు వస్తాయి” అని పలువురు సినీ ప్రముఖులు అభిప్రాయపడ్డారు.
ఇప్పుడీ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందితే, తమిళనాడు దేశంలో మొదటిసారిగా ఈ రకమైన భాషా పరిరక్షణ చట్టం అమలు చేయబోతున్న రాష్ట్రంగా నిలుస్తుంది. ఇది ఇతర ద్రావిడ రాష్ట్రాలకు కూడా ఒక నూతన భాషా రాజకీయ మోడల్గా మారే అవకాశముంది. ఈ బిల్లు తమిళ గౌరవం, సాంస్కృతిక పరిరక్షణ, రాజ్యాంగ హక్కులు, రాజకీయ వ్యూహానికి వెన్నుదన్నుగా నిలవనున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఇది సున్నితమైన అంశం కావడంతో ప్రజలు, ప్రతిపక్షపార్టీలు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి.