ఏపీ కూటమి ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. హామీలు ఘనంగా ఇచ్చి అమలులో మాత్రం ఘరానా మోసం చేస్తున్న ప్రభుత్వంగా కూటమి పాలన మారిందని ఆమె మండిపడ్డారు. ఏటా జనవరి వస్తోంది, పోతుందన్న షర్మిల… సంవత్సరాలు మారుతున్నా క్యాలెండర్ మాత్రమే మారుతోందని, కానీ ఫస్ట్ తారీఖున విడుదల చేస్తామని చెప్పిన జాబ్ క్యాలెండర్‌కు మాత్రం ఇప్పటివరకు దిక్కులేదని వ్యాఖ్యానించారు. రికార్డు చేసి పెట్టుకోండని చెప్పి ఇచ్చిన హామీలకు విలువ లేకుండా పోయిందని, ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతకు ఆశ చూపి భారీగా ఓట్లు దండుకుని, రెండో ఏడాది కూడా జాబ్ క్యాలెండర్ ఊసే ఎత్తకపోవడం దుర్మార్గమని విమర్శించారు.
గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లు జాబ్ క్యాలెండర్ పేరుతో యువత చెవుల్లో పూలు పెడితే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏకంగా కాలీఫ్లవర్లు పెడుతోందని ఎద్దేవా చేశారు. 2025 జనవరి 1 నుంచి క్రమం తప్పని జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. రెండేళ్లలో రెండు జాబ్ క్యాలెండర్ల సంగతేంటి అని నిలదీశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 లక్షల మంది నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ కోసం ఎదురుచూస్తున్నారని, రెండు లక్షలకు పైగా ఖాళీలున్నా షెడ్యూల్ ప్రకటించకపోవడం అన్యాయమని తెలిపారు. వెంటనే రెండు లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, కొలువులు ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.