ఈ టైటిల్ చూసి చాలా మంది నవ్వుకుంటూ ఉండొచ్చు… లేదా అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశం ఏకాకిగా ఏలా మారుతుంది అని ప్రశ్నించే అవకాశాలు కూడా ఉండొచ్చు. కానీ, రాబోయే రోజుల్లో ఇది ముమ్మాటికి నిజం కాబోతున్నది. ఒకప్పుడు ఒక దేశాన్ని ఆక్రమించాలంటే యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి. కానీ, ఇప్పుడు యుద్ధాలు అవసరం లేదు. ఆర్థికంగా ఇబ్బందులు పెడితే చాలు ఆయా దేశాలు కాళ్లబేరానికి వస్తాయి. ఈనానుడిని నిజం చేయాలని అమెరికా భావిస్తున్నది. శతృదేశాన్ని ఓడించడానికి దాని మిత్రదేశాలపై ఆర్థికంగా ఒత్తిడి తీసుకురావాలన్నది అమెరికా నైజంగా కనిపిస్తున్నది. దీనికో ఉదాహరణ అమెరికా విధిస్తున్న టారిఫ్‌లు. భారత్, బ్రెజిల్ వంటి పలు దేశాలపై ఇప్పటికే 50 శాతం టారిఫ్‌లను విధించింది.
టారిఫ్‌లను బూచిగా చూపి భారత్‌పై ఒత్తిడి పెంచి రష్యా నుంచి ఆయిల్‌ను దిగుమతి చేసుకోకుండా చూడాలన్నది అమెరికా ప్లాన్. ఇందులో భాగంగానే ఆగస్టు 27 నుంచి 50 శాతం టారిఫ్‌లు అమలులోకి వచ్చాయి. మనకు అమెరికా ఎంత దూరమో, అమెరికాకు మనం కూడా అంతే దూరం. దీనినే ఆర్థిక పరిభాషలో చెప్పుకుంటే అమెరికా ఉత్పత్తులు మరకు ఎంత అవసరమో, అమెరికాకు మన ఉత్పత్తులు కూడా అంతే అవసరం. మన దగ్గర నుంచి ఎగుమతి అయ్యే అంటే అమెరికా దిగుమతి చేసుకునే వస్తువులపై 50 శాతం సుంకం ఉంది. కానీ, మనం అమెరికా ఉత్పత్తులపై ఇప్పటి వరకు సుంకాలను పెంచలేదు. ఉన్నవాటిని అలానే అమలు చేస్తున్నారు.
అయితే, ఇప్పుడు భారత్ వినూత్నంగా ఆలోచించడం మొదలుపెట్టింది. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. అమెరికా విధించిన సుంకాల బూచికి లొంగకుండా దానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. అంటే, సుంకాలు విధించే దేశానికి ఉత్పత్తులు పంపడం కంటే వాటిని దేశంలోనే వినియోగించడం లేదా, వాటి అవసరాలున్న ఇతర దేశాలకు ఎగుమతి చేసేలా ప్లాన్ చేయడం చేస్తున్నది. అంతేకాదు, వాణిజ్య ఒప్పందాలను చేసుకునే దేశాలతో డైరెక్ట్ ట్రాన్స్‌ఫర్ అంటే యూపీఐ ద్వారానే వాణిజ్యం జరిగేలా ప్లాన్ చేస్తున్నది. దీని వలన మారకద్రవ్యంతో పనిలేదు. డాలర్ వినియోగం సాధ్యమైనంత వరకు తగ్గించడమే ప్రధాన ఉద్దేశం.
అంతేకాదు, రష్యా, చైనా, భారత్ ఉన్న బ్రిక్స్‌లో ఇప్పటికే చాలా దేశాలు చేరిపోయాయి. అమెరికా విధానాలను వ్యతిరేకించే దేశాలు ఈ కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. ముఖ్యంగా ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలు ఈ కూటమిలో చేరేందుకు ప్రయత్నిస్తున్నాయి. భారత్, రష్యా, చైనా దేశాలు ఆసియాలో మరింత బలంగా మారుతున్న సంగతి తెలిసిందే. రష్యా- భారత్, రష్యా-చైనా మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. కొన్ని విబేధాల కారణంగా చైనా-ఇండియా మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. ట్రంప్ టారిఫ్‌ల తరువాత చైనా-భారత్ మధ్య సంబంధాలు క్రమంగా బలం పుంజుకుంటున్నాయి.
అటు గల్ప్ దేశాల్లోనూ అమెరికా వైఖరి పట్ల వ్యతిరేకత ఉంది. యూరప్ దేశాల్లోనూ కొంత తిరస్కరణ ఉంది. ఉక్రెయిన్‌కు సపోర్ట్ చేస్తూ ఆ దేశాన్ని యుద్ధ ప్రయోగశాలగా మార్చడంతో ప్రపంచంలోని మెజారిటీ దేశాలు ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాయి. పైగా అమెరికాలో అంతర్గత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో వాటి పరిష్కారమే అగమ్యగోచరంగా మారిపోయింది. హాలీవుడ్ స్టార్లు సైతం అమెరికా సేఫ్ కాదని అమెరికాను వీడిపోతున్నారు. ఇంతకంటే ఆ దేశానికి మరో అవమానం ఇంకొకటి ఉండదు. ప్రపంచ దేశాల పట్ల అమెరికా తన వైఖరిని మార్చుకోకుంటే, రాబోయే దశాబ్ద కాలంలో అమెరికా ఏకాకిగా మారడం ఖాయమనే విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు నార్త్ కొరియా ఏ విధంగా ఏకాకిగా మారిందో దశాబ్ధం తరువాత అమెరికా కూడా అదేవిధంగా మారుతుందని అంటున్నారు.