కాలజ్ఞానం పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి రచించిన గ్రంథం. కాలంలో జరిగే విషయాలను ఆయన కాలజ్ఞానం రూపంలో పొందుపరిచారు. అయితే, కాలజ్ఞానం రాసేందుకు ఆయన ఎంచుకున్న గ్రామం బనగానపల్లె. ఎక్కడో బ్రహ్మండపురం అనే గ్రామాన్ని వీడి హంపి, అహోబలం వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ బనగానపల్లెకు చేరుకున్నాడు. ఇలా వచ్చిన ఆయన అచ్చమ్మ అనే మహిళ ఇంట్లో గోవుల కాపరిగా చేరి, ప్రతిరోజూ రవ్వల కొండకు గోవులను తీసుకొని వెళ్లి గీత గీసేవాడు.

ఆ గోవులు ఆ గీత మధ్యలో ఉన్న గడ్డిమాత్రమే తినేవి. కొంతమంది వ్యక్తులు అచ్చమ్మకు లేనిపోని విషయాలు చెప్పగా…ఆమె స్వయంగా వెళ్లి చూసి ఆశ్చర్యపోయింది. గీత మధ్యలో ఉండే గడ్డిని మాత్రమే తింటున్నాయి. కానీ, పాలు మాత్రం సమృద్ధిగా ఇస్తున్నాయి. ఆ కొండ గుహలోకి వెళ్లి చూడగా అక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాస్తూ కనిపించారు. ఆ సమయంలో ఆయన శ్రీమహావిష్ణువుగా అచ్చమ్మకు కనపినించడంతో ఆశ్చర్యపోతుంది. ఈ విధంగా వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాస్తుండగా మొదటిసారి అచ్చమ్మ ఆయన్ను దర్శించుకున్నది.