కలియుగంలో ధర్మబద్ధంగా జీవించడం చాలా కష్టం. ధర్మంగా ఉండాలని చెప్పడం వరకు సరే. అలానే జీవించాలి అంటే అందరికీ సాధ్యం కాదు. వారి వారి పరిస్థితులు వారిని ధర్మంగా నిలబెట్టలేవు. ధర్మంగా జీవించలేనపుడు దాని ప్రభావం మనింట ఉండే సంపద అంటే లక్ష్మీదేవిపై పడుతుంది. ఇంట్లోకి అధర్మం ప్రవేశించినపుడు దానితో పాటుగా మరో నలుగురు కూడా ప్రవేశించే అవకాశం ఉంటుంది. నలుగురిలో ఎవరో ఒకరిచేత మన సంపద ఖర్చు అవుతుంది. మరి ఆ నలుగురు ఎవరు? ధర్మం కథేంటో తెలుసుకుందాం.
ఒకానొక సమయంలో లక్ష్మీదేవి భూలోకానికి వచ్చేందుకు పలువిధాలుగా సందేహించింది. తాను భూలోకానికి వెళ్లలని, లోభులు, పీడితులు, వ్యామోహం కలిగినవారు ఉన్నారని చెబుతుంది. దీనికి శ్రీమహావిష్ణువు చిరునవ్వు నవ్వి, భూలోకానికి వెళ్లడం ధర్మమని, తనతో పాటుగా మరో నలుగురిని కూడా పంపుతానని శ్రీమహావిష్ణువు చెబుతాడు. లక్ష్మీదేవితో పాటుగా నలుగురిని ఇచ్చి భూలోకానికి పంపుతాడు. ఆ నలుగుఇలో ఒకరు రాజు, రెండో వ్యక్తి అగ్ని, మూడో వ్యక్తి దొంగ, నాలుగోది రోగం.
ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉండాలని కోరుకుంటారు. ఇది సహజం. లక్ష్మీదేవి కోసం పూజలు వ్రతాలు చేస్తారు. ధర్మబద్ధమై జీవించినంత కాలమే లక్ష్మీదేవి మనతో ఉంటుంది. ఎప్పుడైతే అధర్మానికి పాల్పడటం మొదలుపెట్టారో అప్పటి నుంచే ఆమె ఆ ఇంటి నుంచి వెళ్లిపోతుంది. ఆ సమయంలో రాజు ఇంటికి వచ్చే అవకాశం ఉంటుంది. అధర్మసంపాదనను లాగేసుకుంటాడు. లేదా అగ్నితో సంపద మొత్తం ఆహుతి అవుతుంది. లేదా బంధువులు లేదా దొంగల రూపంలో ఇంటికి వచ్చి దోచుకుపోతారు. ఇక చివరిగా రోగం. మనిషి ఎంత అధర్మానికి పాల్పడితే అన్ని రోగాలు చుట్టుముడతాయి. ఈ రోగాలకు సంపదను ఖర్చుచేయవలసి వస్తుంది. మూడింటినుంచి తప్పించుకున్నా…మనిషి నాలుగోదాని నుంచి తప్పించుకోలేడు. ధర్మంగా జీవించేవారికి ఈ నాలుగు ఆమడదూరంలోనే ఉంటాయి.
ఇందులో ఉన్న నీతి ఏమంటే…ధర్మబద్ధమైన సంపాదన మాత్రమే మనతో ఉంటుంది. అధర్మంగా సంపాదించినా…అధర్మంగా సంపాదిస్తున్న వ్యక్తుల వద్ద పనిచేసి ధనం సంపాదించినా అది ఎంతోకాలం నిలబడదు. ఏదోఒక రూపంలో హరించుకుపోతుంది.