సుబ్రహ్మణ్యేశ్వరుడిని ఆరాధించిన వారికి సంతానం కలుగుతుంది. కానీ, ఇక్కడి సుబ్రహ్మణ్యుడిని ఆరాధించిన వారి కోరికలు నెరవేరడమే కాకుండా క్రమశిక్షణ కలిగిన జీవితం కూడా అలవడుతుంది. జీవితంలో క్రమశిక్షణ లేకుంటే చుక్కాని లేని నావలా, గాలివాటుకు ఎగిరే గాలిపటంలా మారుతుంది జీవితం. సోషల్ లైఫ్‌లో కష్టమైనా సరే క్రమశిక్షణ ఉండాలి. సుబ్రహ్మణ్యుడిని దర్శించుకున్నవారికి తప్పకుండా ఆ క్రమశిక్షణ అలవడుతుందని భక్తుల నమ్మకం.
మాంసాహారం నిషేధం
ఆదివారం వచ్చిందంటే చాలు అందరూ మాంసాహారం వైపు పరుగులు తీస్తారు. కానీ, ఆ గ్రామంలో ఆదివారం ఎలాంటి మాంసాహారం తీసుకోరు. ఆదివారం సెలవు దినాన్ని ఆ గ్రామంలోని ప్రజలు ఖచ్చితంగా పాటిస్తారు. అంతేకాదు, గ్రామంలో ఎవరైనా మరణిస్తే ఆదివారం రోజున దహన సంస్కారాలు కూడా పాటించరు. ఒక్క ఆదివారం మాత్రమే కాదు, మిగిలిన ఆరు రోజులు కూడా మాంసాహారం ఆ గ్రామంలో దొరకదు. ఎవరికైనా మాంసాహారం కావాలంటే ఆ గ్రామం నుంచి ఆరు కిలోమీటర్లు వెళ్లి తీసుకోవాలి. ఇన్ని ఆచారాలను ఈ గ్రామం ఎందుకు పాటిస్తోంది అంటే దానికి కారణం సుబ్బారాయుడే. సుబ్బారాయుడు అంటే ఎవరో మనిషి అనుకుంటే పొరపాటే…శ్రీవల్లీ సమేత సుబ్రహ్మణ్యస్వామి గ్రామంలో సుబ్బారాయుడిగా దర్శనం ఇస్తున్నాడు. ఇంతకీ ఈ గ్రామం ఎక్కడుందో తెలుసా… కర్నూలు జిల్లా పాణ్యం మండలం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తూరు గ్రామంలో ఉంది. కోరిన కోరికలను తీర్చే సుబ్బారాయుడు సర్పరూపంలో సుమారు 500 ఏళ్లుగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. మరి ఈ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందామా..
సుబ్బారాయుడు ప్రత్యక్షం
ఈ కథ మనకు తెలియాలంటే మనం 500 ఏళ్లు వెనక్కి వెళ్లాలి. కొత్తూరు గ్రామానికి చెందిన బీరం చెన్నారెడ్డి అనే రైతు ఆర్థికపరమైన ఇబ్బందులతో బాధపడుతున్నాడు. ఎంత పొలం దున్నినా, ఎన్ని పంటలు వేసినా ఆర్థిక బాధలు తీరడం లేదు. ఈ నేపథ్యంలో ఈ బాధల నుంచి బయటపడేందుకు ఆ రైతు ఓ బ్రాహ్మణుడిని ఆశ్రయించి మార్గం చూపమని వేడుకున్నాడు. చెన్నారెడ్డి బాధను అర్థం చేసుకున్న బ్రాహ్మణుడు మాఘశుద్ధి షష్టి రోజున పొలం దున్నమని చెబుతాడు. బ్రాహ్మణుడు ఇచ్చిన సలహా మేరకు ఆ రైతు మాఘశుద్ధ షష్టి రోజున పొలం దున్నుతాడు. అలా దున్నుతున్న సమయంలో భూమిలో నాగలికి అడ్డుతగులుతుంది. అలా నాగలికి వస్తువు అడ్డుతగలగానే వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు వచ్చాయి. నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. ఆ మేఘాల్లో 12 తలల నాగదేవత ప్రత్యక్షమైంది. నాగేంద్రుని దివ్యమంగళ తేజస్సును చూసిన రైతు కంటిచూపు పోయింది. ఆ సమయంలో అక్కడికి వచ్చినవారు నాగలిని వెనక్కిలాగి ఆ ప్రదేశంలో తవ్వగా 12 శిరస్సులతో కూడిన నాగేంద్రుని విగ్రహం బయటపడింది. ఆ సమయంలోనే ఓ బాలుడు ప్రత్యక్షమై నేను సుబ్బారాయుడిని. మూడు రోజులపాటు నాకు క్షీరాభిషేకం చేయాలని, అప్పుడే చెన్నారెడ్డికి కళ్లు వస్తాయని చెబుతాడు. బాలుడు చెప్పిన విధంగా సుబ్బారాయుడికి మూడు రోజులపాటు పాలాభిషేకం చేస్తారు.
గుడిలేకుండా దర్శనం
అలా మూడు రోజులపాటు పాలాభిషేకం చేయగా… చెన్నారెడ్డికి దృష్టి వస్తుంది. ఆ అద్భుతం చూసి తరించిన గ్రామస్తులు సుబ్బారాయుడికి గుడిని నిర్మించాలని గ్రామస్తులు తలుస్తారు. గ్రామస్తుల కోరిక మేరకు నిర్మాణం అంశాన్ని సుబ్బారాయుడు ఇలా తెలియజేస్తాడు. రాత్రి రోకలిపోటు తరువాత మొదలుపెట్టి తెల్లవారుజాము కోడికూసే వేళ్లకు ఆలయాన్ని పూర్తి చేయాలని, అలా పూర్తికాకుంటే గ్రామంలో ఏడుగురు మరణిస్తారని చెబుతాడు. గ్రామస్తులంతా నడుం బిగించి భూమిలో దొరికిన స్వయంభూ విగ్రహాన్ని ఆలయం కట్టాలని నిర్ణయించిన ప్రదేశంలో ఉంచి గుడిని నిర్మించడం మొదలుపెడతారు. తెల్లవారుజాము వరకు కేవలం ప్రహరీగోడ మాత్రమే పూర్తవుతుంది. పైకప్పు లేకుండానే ఆలయంలో స్వామివారి స్థాపన జరిగింది. అప్పటి నుంచి నేటి వరకు అంటే సుమారు 500 ఏళ్లుగా ఆలయం పైకప్పు లేకుండానే స్వామివారు పూజలు అందుకుంటున్నారు. చుట్టుపక్కల వారికి కొత్తూరు అనే కంటే సుబ్బారాయుడు కొత్తూరు అంటేనే బాగా తెలుస్తుంది.