మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా ప్రారంభమైన “అభ్యుదయం సైకిల్ యాత్ర” ను విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జట్టి ఆదేశాలతో, విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఉత్తర్వులతో జిల్లాలోని పూసపాటిరేగ మండలంలో విశేష స్పందనతో కొనసాగింది. తొలుత పూసపాటిరేగలో జిల్లా పరిషద్ ఉన్నత పాఠశాలలో సుమారు 500 విధ్యార్ధులతో గంజాయి మరియు మాదక ద్రవ్యాల పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో విజయనగరం డిఎస్పీ ఆర్.గోవిందరావు గారు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విజయనగరం డిఎస్పీ ఆర్.గోవిందరావు మాటలాడుతూ సమాజంలో మార్పు కోసం ఒక దృఢ సంకల్పంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారని తెలిపారు. యువత భవిష్యత్తును కాపాడేందుకు విద్యాసంస్థలను మత్తు రహిత ప్రాంతాలుగా మార్చడం అవసరం అన్నారు. దేశానికి యువతే వెన్నుముక్క అని అలాంటి యువత మత్తు పదార్ధాలకు బానిసలు అయ్యి జీవితాలను నాశనం చేసుకోకూడదని తెలిపారు. మాదకద్రవ్యాల బారిన పడినవారిని శిక్షించడం మాత్రమే సరిపోదని, వారిని తిరిగి సమాజంలో నిలబెట్టేందుకు పునరావాస చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. యువత భవిష్యత్తును రక్షిస్తూ డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించుటలో అందరు తమవంతు బాధ్యతగా ముందుగు రావాలని పిలుపునిచ్చారు.
గంజాయి అమ్మినా, కలిగివున్న, తరలించినా నేరమేనని తెలిపారు. ప్రజలు గంజాయి మరియు ఇతర అసాంఘిక కార్యక్రమాల గురించి సమాచారం తెలిస్తే వెంటనే 1972కు, 100/112కు లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరితో విజయనగరం డిఎస్పీ ఆర్.గోవిందరావు డ్రగ్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు.అనంతరం భోగాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.రామకృష్ణ మాట్లాడుతూ – యువత మరియు విద్యార్ధులకు గంజాయి మరియు మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్ప్రభావాలపై వివరించారు. విద్యార్ధులు పట్ల ఉపాధ్యాయుల పర్యవేక్షణ పెరగాలని, అదేవిధంగా తల్లితండ్రులు తమ పిల్లల పట్ల మరింత శ్రద్ద వహించాలన్నారు. సమాజంలో జరుగుతున్న చెడు పట్ల యువత అవగాహన కలిగి ఉండాలని, చెడు వ్యసనాల జోలికి వెళ్ళకుండా భవిష్యత్తును అందంగా మలుచుకోవాలన్నారు. సమాజంలో మార్పు కోసం చేపడుతున్న ఈ అభ్యుదయం సైకిల్ యాత్రను విజయవంతం చేయాలని అందరినీ కోరారు.
అనంతరం గంజాయి మరియు మాదక ద్రవ్యాల పై సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేశారు. అనంతరం సైకిల్ ర్యాలీనివిజయనగరం డిఎస్పీ ఆర్.గోవిందరావు , స్థానిక నేతలు పూసపాటిరేగలో జండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంకల్ప రధం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అక్కడ నుండి అభ్యుదయం సైకిల్ ర్యాలి కోలాటాలు, వాయిద్యాలు, తీన్మార్, డిజెల నడుమ జన సందోహంతో కలిసి మార్గ మధ్యలో కరపత్రాలు పంచుతూ, ప్లకార్డులు చూపిస్తూ, విద్యార్ధులకు మత్తు పదార్ధాల వలన కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కలిపిస్తు రెల్లివలస, కుమిలి గ్రామాలలో జిల్లా పరిషద్ ఉన్నత పాఠశాలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టి నెల్లిమర్ల మండలంలోకి ప్రవేశించింది. విద్యార్థులు, యువత ర్యాలీతో పాటు నడుస్తూ మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా సంఘీభావం తెలిపారు. నెల్లిమర్ల మండలంలోకి ప్రవేశించిన సైకిల్ ర్యాలికు ధనన్నపేట వద్ద ఘనంగా స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో భోగాపురం సీఐ జి.రామకృష్ణ, పూసపాటిరేగ ఎస్ఐ ఐ.దుర్గ ప్రసాద్, నెల్లిమర్ల పిఎస్ఐ, ఈగల్ సిబ్బంది, మండల నాయకులు వివిధ పాఠశాలల ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు, విద్యార్ధులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.