ఆఫ్ఘన్‌ పాక్‌ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత…

ఆఫ్ఘన్‌ రాజధాని కాబూల్‌పై పాక్‌ వైమానిక దళం దాడులు చేసిన కొన్ని గంటల్లోనూ ఆఫ్ఘన్‌ ప్రభుత్వం ప్రతీకార దాడులకు తెగబడింది. పాక్‌ సరిహద్దుల్లో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు పాకిస్తాన్‌కు చెందిన పలు సైనిక స్థావరాలపై దాడులు చేసింది. అంతేకాదు, తాజా సమాచారం ప్రకారం పాక్‌కు చెందిన ఏడు చెక్‌ పోస్ట్‌లను ద్వంసం చేసి వాటిని తాలిబన్లు ఆక్రమించుకున్నట్టుగా సమాచారం. తమ పౌరుల మరణాలకు కారణమైన వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని తాలిబన్‌ ప్రభుత్వం తెలియజేసింది. పాక్‌ సరిహద్దుల వెంట ఉన్న హెల్మండ్‌, పక్తియా, ఖోస్ట్‌ ప్రావిన్సుల్లోని పాకిస్తాన్‌ సైనిక స్థావరాలపై తాలిబన్లు తీవ్రమైన దాడులు చేశారు. పాకిస్తాన్‌ కూడా ప్రతీగా దాడులు చేస్తోంది.

దురంద్‌ లైన్‌పై మళ్లీ ఉత్కంఠ

పాక్‌ ఆఫ్ఘనిస్తాన్‌ మధ్య కొన్ని దశాబ్దాలుగా వివాదాస్పదంగా ఉన్న దురంద్‌ లైన్‌ సరిహద్దు వివాదం మరోసారి రణరంగంగా మారింది. ఈ ప్రాంతంలోనే రెండు దేశాల మధ్య తరచుగా దాడులు జరుగుతున్నా… ఈసారి జరిగిన దాడులు మరింత తీవ్రమైనవనే చెప్పాలి. పాక్‌ దళాలు తాలిబన్‌ స్థావరాలను ధ్వంసం చేసినట్టు చెబుతున్నా… పాక్‌కు చెందిన చాలామంది సైనికులు ఈ దాడుల్లో మరణించినట్టుగా తెలుస్తోంది. అయితే, రెండు దేశాలు ఇప్పటి వరకు మృతులపై ఎటువంటి అధికార ప్రకటన చేయలేదు.

అమెరికా వదిలిపోయిన ఆయుధాలతో తాలిబాన్‌ ప్రతిదాడి

ఆఫ్ఘనిస్తాన్‌లో కొత్తగా ఏర్పడిన తాలిబన్‌ ప్రభుత్వం ఉపయోగిస్తున్న ఆయుధాలు, వాహనాలు అన్నీ కూడా ఒకప్పుడు అమెరికా వదిలి వెళ్లిపోయినవే. వీటిని తిరిగి ఉపయోగంలోకి తీసుకొచ్చి పాక్‌పై వాడుతున్నారు. ఇందులో ప్రధానంగా వందలాది హమ్‌వీ వాహనాలు, ఆటోమేటిక్‌ ఆయుధాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. 2021లో అమెరికా ఆఫ్ఘనిస్థాన్‌ను వదిలి వెళ్లిన సమయంలో ఈ వాహనాలను, ఆయుధాలను ఆఫ్ఘన్‌లోనే వదిలేసింది. ఇవే ఇప్పుడు తాలిబన్లకు ప్రధాన బలంగా మారాయి. ఇప్పటి వరకు సంప్రదాయ మోర్టార్లు, గన్నులు వాడిన తాలిబన్లు ఇప్పుడు ఆటోమేటిక్‌ గన్స్‌ వినియోగిస్తున్నారు.

భారత్‌ నుంచి రష్యాకు బుద్ధుని అవశేషాలు… సాంస్కృతిక బంధానికి పునాదులు

ప్రాంతీయ ఉద్రిక్తతలకు సంకేతం

ఈ దాడులు రెండు దేశాల మధ్య సమస్యగా కంటే, దక్షిణాసియా భద్రతపై ఆందోళన కలిగించే అంశంగా మారింది. తాలిబన్‌ దాడులను సరిహద్దు ఉల్లంఘనగా పాకిస్తాన్‌ చెబుతుంటే, తమ ప్రాంతంపై పాక్‌ వైమానిక దాడుల్లో మరణించిన పౌరులపై ప్రతీకార చర్యగా తాలిబన్‌ చెబుతున్నది. అయితే, ఈ రెండు దేశాల మధ్య ఘర్ణణను ప్రపంచదేశాలు జాగ్రత్తగా గమనిస్తున్నాయి. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చివేసి అధికారంలోకి వచ్చిన ఉగ్రవాద తాలిబన్లు ఇప్పుడు అక్కడ సుస్థిరమైన పాలన అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. శాంతిభద్రతలతో కూడిన పాలన చేపడుతున్నారు. తమను అధికారికంగా గుర్తించాలని, తమ దేశంలో వివిధ దేశాలు రాయబార కార్యాలయాలను ప్రారంభించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆఫ్ఘనిస్తాన్‌ విదేశాంగశాఖ మంత్రి భారత్‌కు వచ్చి ఆఫ్ఘనిస్తాన్‌ రాయబార కార్యాలయంలో గడిపారు. భారత్‌ విదేశాంగశాఖతో కీలక చర్చలు నిర్వహించారు.

భారత్‌ పర్యటనలో ఉండగానే ఈ దాడులు మొదలుకావడంతో భారత్‌పై ఉన్న కోపంతోనే పాక్‌ దాడులకు పాల్పండదని కూడా అనుమానాలు కలుగుతున్నాయి. పైగా కాబూల్‌లో భారత్‌ తన రాయబార కార్యాలయాన్ని తిరిగి పునరుద్దరించడం కూడా పాక్‌ నచ్చకపోవచ్చు. ఆఫ్ఘనిస్తాన్‌ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తిస్తూనే, గతంలో ఆఫ్ఘన్‌లో తలపెట్టిన పనులను తిరిగి పునరుద్దరించేందుకు కూడా భారత్‌ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇలాంటి దాడులు జరగడం పాక్‌ వంకరబుద్ధికి నిదర్శనమనే చెప్పాలి.

ఇక ఇదిలా ఉంటే, భూభాగాలపై అధికారం, ఉగ్రవాద ఆశ్రయాలపై ఆరోపణలు, రాజకీయ పరస్పర నమ్మక లోపం — ఇవన్నీ కలిపి ఆఫ్ఘాన్‌–పాక్‌ సంబంధాలను మరింత కఠినతరం చేస్తున్నాయి. అంతర్జాతీయ సమాజం ఇరుదేశాలను సంయమనంతో వ్యవహరించాలని కోరుతోంది. ఈ సంఘటనలు కేవలం రెండు దేశాల మధ్య యుద్ధ సంకేతాలుగా కాకుండా, ప్రాంతీయ స్థిరత్వానికి గంభీర హెచ్చరికగా విశ్లేషకులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *