అమెజాన్ ప్రైమ్ కి జర్మనీలోని మ్యూనిక్ రీజినల్ కోర్ట్ షాక్…

2024లో అమెజాన్ తమ ప్రైమ్ వీడియో సర్వీస్‌లో ఒక కీలకమైన మార్పు చేసింది. అప్పటివరకు యూజర్లకు పూర్తిగా యాడ్-ఫ్రీగా ఉన్న ఈ ప్లాట్‌ఫామ్‌లో ప్రకటనలను ప్రవేశపెట్టింది. యాడ్స్ లేకుండా కంటెంట్ చూడాలంటే, యూజర్లు అదనంగా నెలకు €2.99 చెల్లించాల్సి వచ్చేలా చేసింది. ఈ నిర్ణయాన్ని అమెజాన్ అనేక దేశాల్లో అమలు చేసినప్పటికీ, జర్మనీలో మాత్రం ఇది పెద్ద న్యాయ సమస్యగా మారింది.

జర్మనీలోని మ్యూనిక్ రీజినల్ కోర్ట్ ఈ వ్యవహారంపై కీలక తీర్పు ఇచ్చింది. ఇప్పటికే ఉన్న ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్ ఒప్పందాలను మార్చేముందు, యూజర్ల నుంచి సరైన అనుమతి తీసుకోలేదని కోర్టు స్పష్టం చేసింది. యాడ్-ఫ్రీగా సినిమాలు, సిరీస్‌లు చూడటం అనేది ప్రైమ్ వీడియో యొక్క ప్రధాన లక్షణమని, అది స్పష్టంగా ప్రకటనల్లో చెప్పకపోయినా యూజర్లు ఆశించే ముఖ్యమైన సౌకర్యమని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.

ప్రకటనలు చేర్చడం వల్ల సబ్‌స్క్రిప్షన్ నాణ్యత గణనీయంగా తగ్గిందని కోర్టు పేర్కొంది. అంతేకాదు, ఈ మార్పు గురించి యూజర్లకు పంపిన అమెజాన్ ఈమెయిల్‌పై కూడా కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. “మీ నుంచి ఎలాంటి చర్య అవసరం లేదు” అన్నట్టుగా ఆ ఈమెయిల్ ఉండటం, నిజానికి ఒప్పందంలో పెద్ద మార్పు జరిగినప్పటికీ యూజర్లను తప్పుదారి పట్టించిందని కోర్టు అభిప్రాయపడింది. దీనివల్ల అమెజాన్ జర్మనీకి చెందిన Unfair Competition Act‌ను ఉల్లంఘించినట్టుగా తేలింది.

ఈ తీర్పు నేపథ్యంలో, అమెజాన్ వెంటనే యాడ్స్ తొలగించాల్సిన అవసరం లేదా యూజర్లకు రిఫండ్ ఇవ్వాల్సిన ఆదేశాలు మాత్రం కోర్టు ఇవ్వలేదు. అయితే, ఇకపై తప్పుదారి పట్టించే సమాచారాన్ని ఇవ్వకూడదని, యూజర్లకు సరైన స్పష్టీకరణ నోటీసులు పంపాలని ఆదేశించింది. అమెజాన్ ఈ తీర్పుతో అసహమతి వ్యక్తం చేస్తూ, దీనిపై అప్పీల్ చేయాలా అనే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిపింది.

ఇప్పుడు ఈ విషయం భారత్ సహా ఇతర దేశాల్లో కూడా చర్చకు దారి తీస్తోంది. జర్మనీలో ఎదురైన ఈ న్యాయ సమస్య వల్ల, భారత మార్కెట్‌లో అమెజాన్ ప్రైమ్ వీడియోపై కూడా నియంత్రణ సంస్థల దృష్టి పడుతుందా? లేక యాడ్స్ విధానంపై అమెజాన్ పునరాలోచన చేస్తుందా? అన్నది వేచి చూడాల్సిన అంశంగా మారింది. OTT ప్లాట్‌ఫామ్‌ల భవిష్యత్తు దిశను ప్రభావితం చేసే అంశంగా ఈ కేసు మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *