రోగుల నడ్డి విరుస్తున్న నకిలీ మందులు

దేశవ్యాప్తంగా నకిలీ మరియు నాశీరకం మందులు చలామణి అవుతున్నాయనే విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ సీడీఎస్‌సీఓ (Central Drugs Standard Control Organisation) వివిధ రాష్ట్రాల నుంచి మందుల నమూనాలను సేకరించి ప్రయోగశాలల్లో పరీక్షలు నిర్వహించగా, సంచలన విషయాలు బయటపడ్డాయి. పెద్ద కంపెనీల పేర్లను పోలి ఉండే లేబుళ్లు ముద్రించి, చిన్నా చితక తయారీ సంస్థలు నకిలీ మందులను విపణిలోకి విడుదల చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

ఈ నకిలీ మందులు వాడుతున్న రోగులకు ఉన్న వ్యాధులు తగ్గకపోగా, కొత్త సమస్యలు తలెత్తుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గ్యాస్ట్రిక్‌ సమస్యలకు వాడే పెంట్రప్రజోల్‌, పెంట్రప్రజోల్‌-డోంపరిడోన్‌ పీఆర్‌ ట్యాబ్లెట్లు, క్యాప్సూల్స్‌, అలాగే డైజీఫామ్‌ ఇంజక్షన్లు అత్యధికంగా నకిలీ రూపంలో మార్కెట్లోకి వస్తున్నాయి.

ఈ దుష్టచర్యలకు ప్రధాన కేంద్రాలుగా పశ్చిమ బెంగాల్‌, బీహార్‌, పంజాబ్‌, రాజస్థాన్‌, అస్సాం, జమ్ముకశ్మీర్‌, పుదుచ్చేరి రాష్ట్రాలను గుర్తించారు. తాజాగా తెలంగాణలో కూడా కొన్ని నకిలీ మందులను అధికారులు పట్టుకున్నారు. అధిక లాభాల ఆశతో మధ్యవర్తులు, డీలర్లు ఈ మందులను బహిరంగంగా విక్రయించడం ఆందోళన కలిగిస్తోంది.

సీడీఎస్‌సీఓ అధికారులు ఇప్పటికే రాష్ట్ర ఔషధ నియంత్రణ శాఖలతో కలసి ప్రత్యేక దళాలను ఏర్పాటు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. నకిలీ మందులు తయారు చేస్తున్న సంస్థలు, వాటిని మార్కెట్లోకి తీసుకొచ్చే వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *