ప్రమోషన్ల ఆనందం ప్రజలకు అందించే సేవల్లో కనబడాలి – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

  • ఉద్యోగులు నిష్పక్షపాతంగా, నిబద్ధతతో వ్యవహరించాలి
  • పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికే నూతన సంస్కరణలు
  • గత ప్రభుత్వంలో పోస్టింగ్ కీ, ప్రమోషన్ కీ ఓ రేటు కార్డు ఉండేది
  • కూటమి పాలంలో సీనియారిటీ, సిన్సియారిటీకే ప్రాధాన్యం
  • గతంలో ఎన్నడూ లేని విధంగా 10 వేల మందికి పైగా పదోన్నతులు
  • నేను జవాబుదారీతనంతో ఉంటా… మీరూ తప్పు చేయొద్దు
  • పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులతో మాటా మంతి కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

ఒక ప్రభుత్వ ఉద్యోగి కుమారుడిగా ఉద్యోగుల సమస్యలు, ఆకాంక్షలు తనకు తెలుసని, మొదటి రోజునుండే పారదర్శకమైన పదోన్నతుల విధానాన్ని అమలు చేయాలని సంకల్పించినట్లు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రమోషన్ ఉద్యోగి ఇంట్లో పండుగ వాతావరణం తీసుకువస్తుంది కాబట్టి, పంచాయతీరాజ్–గ్రామీణాభివృద్ధి శాఖల్లో పదోన్నతుల వ్యవస్థను బలంగా, స్పష్టంగా రూపొందించామని అన్నారు.

గత ప్రభుత్వంలో పోస్టులు, బదిలీలు, పదోన్నతులకు రేటు కార్డులు నడిచిన పరిస్థితిని మార్చి, ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో సీనియారిటీ, సిన్సియారిటీకి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చామని పేర్కొన్నారు. 10 వేల మందికి పైగా ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడం చరిత్రాత్మకమని తెలిపారు. సిఫార్సులు వచ్చినా, అర్హత ఉన్నవారికే అవకాశం ఇచ్చే పారదర్శక విధానం అమలులో ఉందన్నారు.

వ్యవస్థాపరమైన సంస్కరణలు:
రెండు లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్న పంచాయతీరాజ్–గ్రామీణాభివృద్ధి శాఖల్లో అనేక సంస్కరణలు చేపట్టామని, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని ఆదేశించామని చెప్పారు. గత ప్రభుత్వంలో రోడ్లు, మౌలిక వసతుల అభివృద్ధిలో జరిగిన నిర్లక్ష్యాన్ని సరిచేసేందుకు బలమైన సంస్కరణలు అమలు చేస్తున్నామని తెలిపారు.

క్లస్టర్ విధానాన్ని రద్దు చేసి 13,350 పంచాయతీలను స్వతంత్ర యూనిట్లుగా మార్చడం, ప్రతి పంచాయతీకి సెక్రటరీ నియామకం, పంచాయతీ కార్యదర్శిని గ్రామాభివృద్ధి అధికారిగా మార్చడం వంటి సంస్కరణలు ప్రజలకు సేవలు చేరడానికి దోహదమయ్యాయని వివరించారు. పెద్ద పంచాయతీలను రూర్బన్ మోడల్‌గా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.

గ్రామస్థాయి పాలన బలోపేతం కోసం 77 డీడీఓ కార్యాలయాలు ప్రారంభించడం ద్వారా శాఖలన్నింటిని ఒకే దారిలోకి తెచ్చామని చెప్పారు.

ఉద్యోగుల భద్రత:
ఉద్యోగుల హక్కులు, భద్రత తమ బాధ్యత అని, మహిళా ఉద్యోగులపై వేధింపులకు కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కడప జిల్లాలో ఎంపీడీఓపై దాడి జరిగినప్పుడు స్వయంగా వెళ్లి అండగా నిలిచిన విషయాన్ని గుర్తుచేశారు.

ప్రమోషన్ వ్యవస్థలో చారిత్రక నిర్ణయాలు:
ఎంపీడీఓ, డీడీఓ, జెడ్పీ సీఈవో, ఇంజినీరింగ్ విభాగంలో ఇ.ఎన్.సి స్థాయి వరకు కూడా భారీ ప్రమోషన్లు ఇచ్చామని చెప్పారు. గ్రూప్-1 అధికారులకు ఇన్నేళ్లుగా రాని పదోన్నతుల సమస్యను పరిష్కరించామన్నారు.

నేను జవాబుదారీతనంతో ఉంటా… మీరూ తప్పు చేయొద్దు. ప్రజలకు సేవల్లో నిష్పక్షపాతంగా ఉండండి అని ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉద్యోగులకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *