రావణుడి సోదరుడిగా కుంభకర్ణుడు ప్రపంచానికి సుపరిచితం. రామాయణంలో లంకాయుద్ధం సమయంలో కుంభకర్ణుడి ప్రస్థావన వస్తుంది. ఆయన్ను నిద్రనుండి లేపడం మహాకష్టం. ఎందరో రాక్షసులు తమ శక్తికొలది ఆయుధాలను గుచ్చి గుచ్చి నిద్రలేపుతారు. కుంభకర్ణుడి గురించి ప్రస్థావించే సమయంలో మనం కొన్ని విషయాలను అస్సలు మర్చిపోకూడదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కుంభకర్ణుడు పుట్టుకతోనే అపారమైన బలంతో ఉండేవాడు. విశ్రవ ముని ఆశ్రమంలో జన్మించిన కుంభకర్ణుడు ఆ వెంటనే వేలాది దేవతలు, జీవులను భక్షించాడు. కుంభకర్ణుడు పెద్దయ్యాక ఇంద్రుడు, యముడిని కూడా జయించాడు.
ఐరావతం దంతాన్ని విరిచి ఇంద్రుడి ఛాతిపై కొట్టినట్టు పురాణాలు చెబుతున్నారు. కుంభకర్ణుడి బలాన్ని చూసి ఈర్ష్యపడిన ఇంద్రుడు కుంభకర్ణుడి వరం మరోలా అడిగేలా చేస్తాడు. ఇంద్రాసనం అడగాల్సిన వాడు సరస్వతి దేవి ప్రభావం కారణంగా నిద్రాసనం అడుగుతాడు. దేవతలు లేకుండా వరాన్ని కోరాలని ప్రయత్నించగా సరస్వతి ప్రభావం చేత నిద్రవత్వం అని అడిగాడు. అయితే రావణుడి అభ్యర్థన మేరకు దాన్ని మార్చి 6 నెలలు నిద్రలో ఉంటే మరో ఆరు నెలలు మేల్కొని ఉండేలా చేశాడు. కుంభకర్ణుడు నిద్రలో ఉండగా ఆయన గురకల శబ్దానికి భూమిసైతం కంపించిపోయేది. కుంభకర్ణుడు రాక్షసుడైనా మంచి గుణాలు కలిగినవాడు. సీతను అపహరించడం తప్పు అని రావణుడికి సలహా ఇచ్చాడు, రాముడితో యుద్ధం చేయవద్దని హెచ్చరించాడు. కానీ రావణుడి అహంకారం వల్ల వినలేదు. ఇది అతని ధర్మజ్ఞానాన్ని చూపిస్తుంది. రావణుడి తప్పును తెలుసుకున్నా, సోదరుడి గౌరవం కోసం యుద్ధంలో పాల్గొన్నాడు. ఇది మహాభారతంలో వికర్ణుడిలా, ధర్మం, కర్మ మధ్య ద్వంద్వాన్ని చూపిస్తుంది. రాముడితో పోరాడటం అధర్మం అని తెలిసినా, కుటుంబ బాధ్యత వల్ల ముందుకు యుద్ధానికి వెళ్లాడు.
కుంభకర్ణుడు మెల్కొని ఉన్నప్పుడు అతని ఆకలి అపారం. సుమారు వెయ్యికి పైగా పశువులను తినేవాడు. 2000 కుండల మద్యం తాగేవాడు. అయితే, లంకా యుద్ధానికి ముందే కుంభకర్ణుడు నిద్రపోవడంతో ఆయన్ను లేపేందుకు 100కి పైగా ఏనుగులు ఎంతో శ్రమించాయి. ఈ ఏనుగులు ఆయనపై నుంచి నడిచినా చలనం లేకపోవడం విశేషం. దీనిని బట్టి కుంభకర్ణుడు ఎటువంటివాడో అర్ధం చేసుకోవచ్చు. ఎవరి వల్ల కాకపోవడంతో ఆయనకు ఇష్టమైన ఆహారాన్ని, మద్యాన్ని తీసుకురాగా నిద్రనుంచి మేల్కొన్నట్టుగా రామాయణ గ్రంథాలు చెబుతున్నాయి.
అంతేకాదు, యుద్ధం కోసం మధ్యలోనే మేల్కొన్న కుంభకర్ణుడు యుద్ధంలో సుమారు 8వేలమంది వానరులను సంహరిస్తాడు. సుగ్రీవుడిని పట్టుకొని ఖైదు చేస్తాడు. హనుమంతుడిని సైతం గాయపరుస్తాడు. కుంభకర్ణుడు ఇదంతా మద్యం మత్తులోనే చేస్తాడు. అయితే, రాముడి బాణాల తాకిడిని తట్టుకోలేక మరణిస్తాడు. కుంభకర్ణుడి మరణం అత్యంత దారుణంగా ఉంటుంది రాముడి బాణాలు అతని కాళ్లు, చేతులు తెంచివేస్తాయి. నోరు బాణాలతో నిండిపోయి ఉంటుంది. కుంభకర్ణుడు కుప్పకూలిన తరువాత వానరులు అతని శరీరాన్ని ముక్కలుగా చేసి తీసుకొని వెళ్తారు. అయితే, రాముడు కుంభకర్ణుడిని గొప్ప యోధుడిగా ప్రశంసిస్తాడు.
కుంభకర్ణుడి మరణాన్ని జీర్ణించుకోలేక అతని ఇద్దరు కుమారులు కుంభ, నికుంభలు కూడా యుద్ధంలో పాల్గొని రాముడిని అంతం చేయాలని అనుకుంటారు. కానీ, వీరోచితంగా పోరాడి ఆ యుద్ధంలో మరణిస్తారు. అయితే, శివపురాణం ప్రకారం కుంభకర్ణుడికి మూడో కుమారుడు కూడా ఉన్నాడు. అతనిపేరు భీముడు. ఈ భీముడి తల్లి కర్కటి. తల్లి సలహా మేరకు భీముడు యుద్ధంలో పాల్గొనకుండా సహ్యాద్రి పర్వతాలకు వెళ్లి తపస్సు చేసుకుంటాడు. బ్రహ్మగురించి తపస్సు చేస్తాడు. ఎలాగైనా శ్రీమహావిష్ణువును అంతం చేయాలని అనుకుంటాడు. కానీ, ఈ భీముడు శివుడి చేతిలో అంతం కావడం, అంతమయ్యే సమయంలో భీముడు కోరిన మేరకు శివుడు అక్కడే జ్యోతిర్లింగంగా వెలిశాడు. అదే నేటి భీమేశ్వర జ్యోతిర్లింగం.
ఇక్కడ మరో విశేషమేమంటే విశ్రవ ముని ఆశ్రమంలో జన్మించిన కుంభకర్ణుడు రాక్షసుడు కాదని, ఆయనో యంత్రం అని కూడా చెబుతారు. కుంభకర్ణుడిది సహజ శరీరం కాదు… లోక వినాశనం కోసం ముని సృష్టించిన యంత్రం. అందుకే లంకాయుద్ధంలో కుంభకర్ణుడి నోటిలోకి వెళ్లిన వానరులు ఆతని ముక్కు, చెవుల నుంచి బయటకు వస్తారు. కానీ, నిద్రపోయే సమయంలో వచ్చే గురక, ఆకలి మనుషుల మాదిరిగా ఉండటంతో ఆతని జన్మరహస్యం రహస్యంగానే ఉండిపోయింది. కుంభకర్ణుడు రాక్షస రూపంలో ఉన్న మనిషా లేకా యంత్రమా అన్నది నేటికీ సందిగ్దమే.