Native Async

పాకిస్తాన్‌లో శ్రీరాముని రాజ్యం…ఇదే సాక్ష్యం

Lord Rama’s Kingdom in Pakistan Here’s the Evidence
Spread the love

రామాయణం కేవలం ఇతిహాసం మాత్రమే కాదు. ఇంకా ఎన్నో రహస్యాలను, పురాతన అంశాలతో ముడిపడిన అంశం. భారతవర్షం ఎలా విస్తరించిందో ప్రస్తుత మానవాళికి తెలియజేసే ఓ గొప్ప చరిత్ర. రామాయణం అంటే మనకు తెలిసిన అంశం దశరథుడు పుత్రకామేష్టి యాగం చేయడంతో రాముడు, లక్ష్మణుడు, భరతశతృఘ్నులు జన్మించారు. రామ లక్ష్మణులు రాక్షస సంహారం కోసం వెళ్లగా జనకపురిలో సీతా స్వయంవరానికి వెళ్లి శివధనస్సును ఎక్కుపెట్టి సీతమ్మను చేపట్టాడు. తండ్రిమాటను జవదాటకుండా సీతారామ లక్ష్మణులు వనవాసానికి వెళ్తారు. వనవాసంలో సీతమ్మను రావణుడు ఎత్తుకుపోగా సుగ్రీవుడి సహకారంతో హనుమంతుడి ధైర్యసాహసాలతో సీతమ్మజాడ తెలుసుకొని సముద్రం దాటి లంకను చేరి రావణుడిని వధించి సీతమ్మను తీసుకొని అయోధ్యకు వస్తారు. అయోధ్యలో పట్టాభిషేకం తరువాత ఆ ప్రాంతాన్ని ఘనంగా పరిపాలించాడు. రాముడికి లవకుశలు, భరతుడికి తక్షుడు, పుష్కరుడు అనే కుమారులు ఉంటారు. ఇంతవరకు ఇతిహాసం. ఇక్కడి నుంచి భారతవర్షం విస్తరణకు సంబంధించిన చరిత్ర మొదలౌతుంది.

రాజుల ప్రధానుద్దేశం రాజ్యాన్ని విస్తరించడం. రాజవంశాలను పదికాలాలపాటు నిలుపుకోవడం. ప్రజల్లో గొప్ప పేరు తెచ్చుకోవడం. శ్రీహరి అవతారమే అయినప్పటికీ శ్రీరాముడు భూమిపై జన్మించిన మానవుడు. పైగా రాజు. రాజుకు ఉండవలసిన ప్రధాన లక్షణం రాజ్యాన్ని విస్తరించుకోవడమే. ఇందులో భాగంగానే శ్రీరాముని కుమారులు భరతఖండంలోని పశ్చిమ దిశగా రాజ్యాలను ఆక్రమించుకుంటూ అక్కడ రాజవంశాలను స్థాపించారు. లవుడు, కుశుడు, తక్షుడు, పుష్కరుడు పరిపాలన నిమిత్తం ప్రస్తుతం పాకిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో రాజ్యాలను స్థాపించినట్టుగా రామాయణ కథలు, బౌద్ధ కథలు, పురాణాలు చెబుతున్నాయి. పాకిస్తాన్‌లోని నాలుగు ప్రాంతాల్లో నిర్మించిన రాజ్యాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

భూమిపై మానవరూపంలో జన్మించిన శ్రీరాముడి పెద్ద కుమారుడు లవుడు స్థాపించిన నగరమే లాహోర్‌. లవుడు పేరుమీదుగా లవపురి పేరుతో ఈ నగరాన్ని స్థాపించారు. లవుడు స్థాపించిన లవపురి ఆ తరువాత కాలంలో లహౌర్‌గాను లాహోర్‌గాను మార్పు చెందింది. ఇప్పటకీ లాహోర్‌లోని కొన్ని ప్రాంతాల్లో లవ్‌ లైన్‌ అని, లవ్‌ గార్డెన్‌ అనే పేర్లు మనకు కనిపిస్తుంటాయి. లాహోర్‌ కోట పరిసర ప్రాంతాల్లో పురాతన నిర్మాణాలను లవపురం అవశేషాలుగా చెబుతారు. రామాయణ కాలం నాటి కట్టడాలను కాపాడాలని అప్పుడప్పుడు అంతర్జాతీయ సంఘాలు పోరాటం చేస్తుంటాయి. శ్రీరామచంద్రమూర్తి రెండవ కుమారుడు కుశుడు స్థాపించిన నగరం కుశపురం అని చెబుతారు. కుశుడు తన రాజ్యానికి కుశపురాన్ని రాజధానిగా చేసేకొని పాలన సాగించారు. ఈ కుశపురం కాలక్రమంలో ఖశుర్‌గాను ఆ తరువాత ఖాసూర్‌గాను మార్పు చెందింది. లాహోర్‌కు సమీపంలో కుశుడు కుశవంశాన్ని స్థాపించి పరిపాలన చేసినట్టుగా చరిత్రకారులు చెబుతున్నారు.

తక్షశిల పేరు చెప్పకగానే మనకు గుర్తుకు వచ్చేది తక్ష విశ్వవిద్యాలయం. అంతకంటే ముందు నుంచే ఈ నగరం పేరు గాంచింది. భరతుడి కుమారుడైన తక్షుడు తక్షశిల ప్రాంతాన్ని పరిపాలించినట్టుగా వాల్మీకి రామాయణం, రాజతరంగిణి వంటి గ్రంథాలు చెబుతున్నాయి. తక్షశిల అనే పేరు తక్షుడి పేరిటే వచ్చిందని చెబుతారు. ఈ తక్షశిల మహాభారత కాలంనాటి గాంధార దేశానికి రాజధానిగా కూడా ఉంది. బౌద్ధుల కాలంలో తక్షశిల విశ్వవిద్యాలయం ఎంతో పేరుగాంచింది. భరతుడి కుమారుడైన పుష్కరుడు స్థాపించిన మరో నగరం పుష్కలావతి లేదా పురుషపురం. పురాతనమైన గ్రంథాల్లో మనకు పుష్కలావతి అనే పేరు సర్వసాధారణంగా కనిపిస్తుంది. స్వతంత్రానికి పూర్వం పెషావర్‌ను పుష్కలావతి పేరుతోనే పిలిచేవారు. ఇక గ్రీకు బౌద్ధ గ్రంథాలు ఈ నగరాన్ని పురుషపురం పేరుతో పేర్కొన్నాయి. ఈ పుష్కలావతి, పురుషపురమే ఆ తరువాతి కాలంలో పశావర్‌గాను, పెషావర్‌గాను మార్పు చెందింది. రామాయణంలోని ఉత్తరకాండలో లవకుశల రాజ్యవ్యూహం గురించి చెప్పబడింది. అటు బౌద్ధ గ్రంథాల్లోనూ తక్షశిల, పురుషపురంలోని విశ్వవిద్యాలయాలను ప్రస్తావించారు. గ్రీకు చరిత్రకారులు గాంధార దేశంలోని ప్రాచీనమైన నగరాల పేర్లను తమ గ్రంథాల్లో పొందుపరిచినట్టుగా కూడా చెబుతారు. దేశాలుగా విడిపోయినా… వారసత్వం ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పొచ్చు. నేటికీ ఎన్నో హిందూ దేవాలయాలు పాకిస్తాన్‌లో ఉన్నాయి. అక్కడి హిందువులు హైందవ ఆలయాలను దర్శించుకొని పరిరక్షించుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit