ఈ సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్‌లో ఇటీవలి కాలంలో ఎప్పుడూ చూడని స్థాయిలో పోటీ ఉంది. పండుగ సీజన్లో ఏకంగా ఐదు తెలుగు సినిమాలు థియేటర్లలోకి రావడంతో ప్రేక్షకుల్లో భారీ హైప్, ఆసక్తి నెలకొంది. ఇంత భారీ పోటీ మధ్య చివరికి విజేత ఎవరు? అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న.
ప్రస్తుతం అందరి దృష్టి మాత్రం భారీ బడ్జెట్ సినిమాలైన ‘రాజా సాబ్’ ఇంకా ‘మన శంకర వరప్రసాద్ గారు’ మీదే ఉంది. ఇవే ఈ సంక్రాంతి సీజన్లో ఎక్కువగా చర్చకు వస్తున్న చిత్రాలు. ట్రైలర్స్ కూడా బాగుండడం తో సూపర్ హైప్ ఉంది. ప్రభాస్, చిరంజీవి వంటి స్టార్ హీరోలు నటిస్తుండటంతో ఈ సినిమాలకు బాక్సాఫీస్ వద్ద గట్టి ఓపెనింగ్స్ రావడం దాదాపు ఖాయం.
ఈ భారీ చిత్రాలతో పాటు రవితేజ నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’, శర్వానంద్ ‘నారి నారి నడుమ మురారి’ కూడా సంక్రాంతి బరిలో నిలిచాయి. వీటిలో రవితేజ సినిమా మిడ్-రేంజ్ ఎంటర్టైనర్గా నిలుస్తోంది.
స్టార్ వాల్యూ, బడ్జెట్ పరంగా చూస్తే అనగనగా ఒక రాజు ఇంకా నారి నారి నడుమ మురారి చిన్న సినిమాలుగానే కనిపించవచ్చు. కానీ పండుగకు సరిపోయే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజీలు కావడంతో వీటిని తక్కువ అంచనా వేయలేం. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ ఈ సినిమాలు రూపొందినట్లు కనిపిస్తోంది.

నవీన్ పోలిశెట్టి నటించిన అనగనగా ఒక రాజు తన ఫన్ డ్రివెన్ కాన్సెప్ట్‌తో ప్రత్యేకంగా నిలుస్తోంది. షార్ప్ కామెడీకి పేరుగాంచిన నవీన్, ఈ సినిమాకి రచనలో కూడా ఇన్వాల్వ్ అయ్యాడనే టాక్ ఉంది. విడుదలైన ప్రమోస్, ప్రమోషనల్ కంటెంట్ మొత్తం వినోదాన్ని హైలైట్ చేస్తున్నాయి. కంటెంట్ కనెక్ట్ అయితే, ఈ సినిమా అంచనాలకు మించిన బాక్సాఫీస్ ఫలితాలు ఇవ్వడం ఖాయం.

ఇక శర్వానంద్ నటించిన నారి నారి నడుమ మురారి కి కూడా మంచి హైప్ ఉంది. ఇటీవల శర్వానంద్ సినిమాలకు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా, ఈసారి మాత్రం క్లీన్ కామెడీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. టీజర్లో హ్యూమర్ బాగా వర్క్ అవుతుండటంతో పాటు, సామజవరగమన వంటి ఫుల్ లెంగ్త్ కామెడీ ఇచ్చిన దర్శకుడు కావడంతో అంచనాలు పెరిగాయి. ఇంత భారీ పోటీ మధ్య సినిమా రిలీజ్ చేయడం నిర్మాతలకి కంటెంట్ మీదున్న నమ్మకాన్ని స్పష్టంగా చూపిస్తోంది.
ఈ సంక్రాంతి బాక్సాఫీస్ పోరులో భారీ సినిమాల మధ్య ఈ రెండు అండర్డాగ్ సినిమాలు సర్ప్రైజ్ పర్ఫార్మర్స్గా మారే అవకాశం ఉంది. పాజిటివ్ టాక్ వస్తే, ఈ సంక్రాంతికి పెద్ద సినిమాలకు కూడా గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.