త్యాగంతోనూ ధర్మ పరిరక్షణ సాధ్యమని చాటిన మహనీయుడు శ్రీ గురు తేగ్ బహదూర్ – పవన్ కళ్యాణ్

Pawan Kalyan Hails Guru Tegh Bahadur’s Sacrifice at 350th Shaheedi Samagam in Nanded

•ఆయన బలిదానం పొరుగు దేశాల్లో హిందువుల వేదన గుర్తు చేస్తోంది
•అది చరిత్ర కాదు.. మనందరికీ హెచ్చరిక
•ప్రతి పౌరుడూ ధర్మ పరిరక్షణను బాధ్యతగా స్వీకరించాలి
•దేశ సార్వభౌమాధికార పరిరక్షణ కోసం నిలబడాలి
•శ్రీ గురు తేగ్ బహదూర్ సింగ్ షాహిదీ సమాగమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

‘తల్వార్ తోనే కాదు త్యాగంతోనూ ధర్మ పరిరక్షణ సాధ్యమని చాటిన మహనీయుడు శ్రీ గురు తేగ్ బహదూర్ జీ అని తనది కాని ధర్మం కోసం తన శిరస్సుని త్యాగం చేసిన మహనీయుడు ఆయన. అందుకే చరిత్ర శ్రీ గురు తేగ్ బహదూర్ సింగ్ జీని ధరమ్ ది చాదర్.. ఔర్ హింద్ ది ఛాదర్ గా కీర్తిస్తుంద’ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆయన బలిదానాన్ని యావత్ భారత దేశం సత్యం, సాహసం, భావోద్వేగంతో ముందుకు తీసుకువెళ్తుందని చెప్పారు.

శ్రీ తేగ్ బహదూర్ జీ స్ఫూర్తితో ప్రతి పౌరుడు ధర్మాన్ని ఒక హక్కుగా కాకుండా బాధ్యతగా స్వీకరించాలని పిలుపునిచ్చారు. స్వతంత్ర ఫలాలను అనుభవించే ప్రతి భారతీయ పౌరుడు మన దేశ ఔన్నత్యాన్ని భుజస్కందాలపై మోస్తున్నామన్న సంగతిని గుర్తెరిగి మసలుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరు ధర్మాన్ని కేవలం ఒక సంప్రదాయంగా మాత్రమే కాదు బాధ్యతగా స్వీకరించాలి. స్వాతంత్ర్యాన్ని ధర్మ సాధన మార్గంగా ముందుకు తీసుకువెళ్లాలని చెప్పారు. ఆదివారం సాయంత్రం మహారాష్ట్రలోని నాందేడ్ లో ప్రముఖ సిక్కు గురువు శ్రీ తేగ్ బహదూర్ సింగ్ జీ 350వ షాహిదీ సమాగమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “350 ఏళ్లు గడచినప్పటికీ మనమంతా శ్రీ గురు తేగ్ బహదూర్ సింగ్ జీ బలిదానాన్ని స్మరిస్తున్నామంటే ఆయన త్యాగం కేవలం ఒక చారిత్రక సంఘటన మాత్రమే కాదు. ప్రతి మనిషిలోని వివేకానికి పరీక్ష పెట్టిన ఘటన. 1675 నవంబర్ 24వ తేదీన ఢిల్లీలోని చాందినీ చౌక్ వద్ద పెద్ద సమూహం నిలబడి ఉన్నా అందరిలోనూ తెలియని భయం వ్యాపించి ఉంది. ఓ వైపు సమూహం మరోవైపు ప్రభుత్వం, ఇంకో వైపు ఓ శాంతి దూత ఉన్నారు. తన త్యాగంతో ధర్మ పరిరక్షణ సాధ్యమన్న విషయం ఆ దూతకి తెలుసు. బలిదానం అయిన ఆయన్ను తీసుకువెళ్లేందుకు కూడా ఎవరూ సాహసించలేదు. ఆయన బలిదానం నేడు పొరుగు దేశాల్లో ఉన్న హిందూ మైనారిటీల వేదనను గుర్తు చేస్తుంది.

శ్రీ గురు తేగ్ బహదూర్ జీ త్యాగం ఒక చరిత్ర మాత్రమే కాదు. మనందరికీ ఒక హెచ్చరిక. ఈ వేదిక నుంచి భారతీయ యువతకు ఒక మాట చెప్పదలచుకున్నా. శ్రీ గురు తేగ్ బహదూర్ జీ జీవితం నుంచి నేర్చుకోవాల్సింది ఒకటే. మన దేశానికి నేడు బలంగా మాట్లాడే స్వరం అవసరం లేదు.. ఉన్నతమైన వ్యక్తిత్వంతో కూడిన స్వరం అవసరం.

•ఆధ్యాత్మిక శక్తి సామాజిక జీవనానికి దారి చూపాలి:
ఆధ్యాత్మిక శక్తి సామాజిక జీవనానికి దారి చూపాలి. మహారాష్ట్ర ఎప్పుడూ ఇదే చెప్పింది. నిజమైన బలం ఆధిపత్యంలో కాదు పరోపకారంలో ఉంటుందని చాటి చెప్పింది. మహారాష్ట్ర ఒక అసాధారణమైన భూమి. ఇది కత్తి, యుక్తి, కరుణ, శక్తి, సంవేదం కలసి జీవించిన నేల. భిన్న శక్తులు కూడా పరస్పర ప్రేరణ కలిగిస్తాయని నిరూపించిన నేల. చత్రపతి శివాజీ నుంచి శ్రీ సంత్ తుకారాం జీ, శ్రీ సంత్ జ్ఞానేశ్వర్ జీ, మహాత్మా జ్యోతీబా పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి మహనీయులను భారత దేశానికి అందించిన నేల మహారాష్ట్ర. సామర్ధ్యమే కాదు సద్భావన కూడా అవసరం అన్న విషయాన్ని యావత్ దేశానికి బోధించిన నేల ఇది. అందుకే భారత దేశం తాలూకు ఔన్నత్యం గురించి మాట్లాడిన ప్రతి సారి అందులో మహారాష్ట్ర వాణి కచ్చితంగా వినిపిస్తుంది.

•దేశానికి విలువల్ని కాపాడే వీరత్వం అవసరం:
నేడు మన దేశానికి మానవ విలువలను కాపాడే వీరత్వం, ఆత్మపరిశీలన చేసుకునే వివేకం కలిగిన నాయకత్వం అవసరం. గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి 2047 వికసిత్ భారత్ విజన్ కేవలం ఆర్ధిక అభివృద్ధి మంత్రం కాదు. సంస్కృతి, సంప్రదాయం, సామాజిక నిబద్దత కూడా. యువత భాగస్వామ్యం లేకపోతే అది సాధ్యపడదు. నేడు నాందేడ్ పవిత్ర భూమి నుంచి మనమంతా ఒక సంకల్పం తీసుకుని బయలుదేరుదాం. శ్రీ గురు తేగ్ బహదూర్ జీ చాందినీ చౌక్ లో ఓ వృక్షం మాదిరి ఏ విధంగా అయితే నిల్చున్నారో మన భారతదేశం తాలూకు సార్వభౌమాధికార పరిరక్షణ కోసం మనమంతా వటవృక్షంలా నిలబడదాం. శ్రీ గురు తేగ్ బహదూర్ త్యాగం తాలూకు లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్దామ”న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *