మన ఇళ్లలో పెద్దలు చెప్పే కొన్ని మాటలకు వెనుక లోతైన అర్థం ఉంటుంది. “ఇంటి గడపపై కూర్చోకూడదు” అన్న సూచన కూడా అలాంటిదే. ముఖ్యంగా ఆడపిల్లలు గడపపై కూర్చోవడం మంచిది కాదని పెద్దలు పదేపదే చెప్పడంలో వాస్తు, ఆచారం, ఆధ్యాత్మిక భావన కలిసి దాగి ఉన్నాయి. గడప అనేది కేవలం చెక్క ముక్క కాదు… అది ఇంటి శక్తుల ప్రవేశ ద్వారం అని పండితులు చెబుతారు.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం లక్ష్మీస్థానంగా భావిస్తారు. ఇంట్లోకి సంపద, శుభశక్తి, సుఖశాంతులు ప్రవేశించే మార్గం అదే. అందుకే ప్రతి ఉదయం గడపకు పసుపు, కుంకుమ పెట్టడం, ముగ్గులు వేయడం వంటి ఆచారాలు తరతరాలుగా కొనసాగుతున్నాయి. గడపను గౌరవించడం అంటే లక్ష్మీదేవిని గౌరవించినట్లేనని పెద్దల విశ్వాసం.
ఇలాంటి పవిత్రమైన గడపపై కూర్చోవడం, కాళ్లు పెట్టడం అగౌరవంగా భావిస్తారు. ముఖ్యంగా ఆడపిల్లలు గడపపై కూర్చుంటే ఇంటికి ప్రతికూల శక్తి ప్రభావం పెరుగుతుందని జ్యోతిష్య నిపుణులు అంటారు. దృష్టి దోషం ఎక్కువగా పడే అవకాశం ఉండటంతో పాటు, ఆర్థిక ఇబ్బందులు, అనవసర ఖర్చులు, అప్పుల భారం పెరగడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని నమ్మకం.
మరొక కారణం సామాజిక ఆచారంతో కూడా ముడిపడి ఉంది. గడప అనేది ఇంటి అంతరంగం–బయట ప్రపంచం మధ్య సరిహద్దు. అక్కడ కూర్చోవడం వల్ల ఇంటి శక్తి సమతుల్యత దెబ్బతింటుందని భావిస్తారు. దీని ప్రభావం కుటుంబ సభ్యుల మధ్య కలహాలు, మానసిక అశాంతి, పనుల్లో ఆటంకాల రూపంలో బయటపడుతుందని చెబుతారు.
అందుకే మన పెద్దలు గడపపై కూర్చోవద్దని, అక్కడ కాళ్లు పెట్టవద్దని హెచ్చరిస్తుంటారు. ఇది భయపెట్టే నమ్మకం కాదు… ఇంటి శుభశక్తిని కాపాడే ఒక సంప్రదాయ జాగ్రత్త. నేటి ఆధునిక జీవనంలోనూ ఈ చిన్న విషయాన్ని పాటిస్తే ఇంట్లో ప్రశాంతత, సుఖశాంతులు నిలకడగా ఉంటాయని netiprapancham.com అభిప్రాయం.