భారతీయ ఆధ్యాత్మిక లోకాన్ని శతకోటి సూర్య బింబాల తేజస్సుతో దేదీప్యమానం చేసిన విజయనగర ఆధ్యాత్మిక సూఫీ చక్రవర్తి హజరత్ సయ్యద్ షహిన్ షా బాబా ఖాదర్ వలి ర.అ. వారి 67 వ సూఫీ సుగంధ మహోత్సవాలు(ఉరుసు) నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. గురు, శుక్ర, శనివారాల్లో మూడు రోజుల పాటు జరిగే ఈ ఉరుసు మహోత్సవాలకు దేశ, విదేశాలు, వివిధ రాష్ట్రాల నుంచి మతాలకు, జాతులకు అతీతంగా సూఫీ భక్తులు లక్షలాది మంది విచ్చేస్తారని ఖాదర్ బాబా దర్గా దర్బార్ షరీఫ్ ముతవల్లి(ధర్మకర్త) డాక్టర్ ముహమ్మద్ ఖలీలుల్లా షరీఫ్ తాజ్ ఖాదరీ(ఖలీల్ బాబు) వెల్లడించారు. ఈ మేరకు హజరత్ ఖాదర్ బాబా వారి ప్రియశిష్యులు హజరత్ అతావుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదరీ బాబా వారి సూఫీ పరంపర అభిషిక్త వారసులైన చీమలపాడు దర్గా దర్బార్ సూఫీ పీఠాధిపతి ముహమ్మద్ ఖ్వాజా మొహియుద్దీన్ తో కలిసి విజయనగరం దర్బార్ లో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఖ్వాజా మొహియుద్దీన్ మాట్లాడుతూ, 850 సంవత్సరాల క్రితం హజరత్ బాబా ఖాదర్ మొహియునుద్దీన్ చిస్తీ వారు భారత దేశంలో కాలు పెట్టిన తర్వాత అఖండ భారతావనిలో ఒక సూఫీ ఆధ్యాత్మిక విప్లవం వచ్చిందన్నారు. ఆ పరంపరలో హజరత్ బాబా ఖాదర్ అవులియా వారు ఈ విజయనగరం పుడమిపై జన్మించిన తర్వాత రెండోసారి మరో ఆధ్యాత్మికమైన విప్లవం వచ్చిందన్నారు. యావత్ ప్రపంచంలోని కుల, మత, వర్గాలకు అతీతంగా ప్రజలందరినీ సహృదయంతో తన వద్దకు లాక్కొని ఒక ఆధ్యాత్మిక సంపదను నింపిన వారిలో అగ్రగణ్యులు హజరత్ బాబా ఖాదర్ అవులియా వారని ప్రస్తుతించారు.
ఎటువంటి వైద్య సదుపాయాలు లేని నాటి రోజుల్లో ఖాదర్ బాబా వారి కృపా దృష్టి రోగిపై పడితే ఎటువంటి రోగమైనా మటుమాయమైపోయేదని గుర్తు చేశారు. ఖాదర్ బాబా వారి ఒక మాట పలికితే అది జరిగి తీరేది, ఆయన మాటల్లోని మహత్కార్యాలపై ఎందరో రచయితలు రచనలు చేసారని పేర్కొన్నారు. గురువారం ఉదయం హజరత్ ఖాదర్ బాబా వారి శయన మందిరం(దర్గా) లో ఖురాన్ పఠనంతో ఈ ఉరుసు మహోత్సవం ప్రారంభమవుతుందని తెలిపారు. అదే రోజు రాత్రికి బాబా వారికి శుద్ధి స్నానం(గుషుల్) జరుగుతుందని చెప్పారు. ఆ రోజు మొదలయ్యే అన్న సమారాధన ఉరుసు మూడు రోజుల పాటు నిర్విరామంగా జరుగుతుందని తెలిపారు.
జ్ఞాని ప్రసాదిస్తూ, స్వీకరిస్తున్నట్టు వినయంగా ఉంటాడు. అజ్ఞాని స్వీకరిస్తూ, ప్రసాదిస్తున్నట్టు అహంకారంతో ఉన్నట్టుగా ఖాదర్ బాబా తన పనిని తానే చేయించుకుంటున్నారు, తప్ప ఎవరూ చేసేది కాదని ఉపదేశించారు. రెండో రోజు అనగా పవిత్ర శుక్రవారం రోజు ఉదయం 10 గంటలకి ప్రధాన ఘట్టమైన సందల్ అనగా ఖాదర్ బాబా వారి చిత్ర పటం ఊరేగింపుగా నగర వీధుల్లోకి సందడిగా వెళ్తుందని తెలిపారు. బాబా వారు భౌతికంగా జీవించిన కాలం నుంచే అనాదిగా ఈ చిత్ర పటం ఊరేగింపు(సందల్) నగర వీధుల్లో ఘనంగా జరగడం విశేషం అని అభివర్ణించారు. బాబా వారిని వీక్షించడానికి వేలాది మంది భక్తులు ఈ ఉరుసు మహోత్సవాలకు రావడం ఇక్కడి ప్రత్యేకత అని వివరించారు. ఊరేగింపు నుంచి తిరిగి వచ్చాక దర్గాపై బాబా వారికి సుగంధ, చాదర్, పరిమళ ద్రవ్యాల సమర్పణ జరుగుతుందని తెలిపారు. మూడో రోజు భక్తులు అందరికీ బాబా వారి శేష వస్త్రాలు, తబురుక్ (ప్రసాదం) పంపిణీ కార్యక్రమాలతో 67వ ఉరుసు మహోత్సవాలు ముగుస్తాయని తెలిపారు.
మూడు రోజుల పాటు జరిగే ఈ ఉరుసు ఉత్సవాలకు దేశ నలుమూల నుంచి లక్షకు పైగా భక్తులు హాజరవుతారని, వారందరికీ అవసరమైన ఆహారం వసతి, తాగునీరు, మరుగుదొడ్లు వంటి సదుపాయాలన్నీ ధర్మకర్త ఖలీలుల్లా షరీఫ్ కల్పించడం జరిగిందని తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్, విద్యుత్ శాఖ, పోలీస్ శాఖ అధికారులు, సిబ్బంది, జర్నలిస్ట్ మిత్రులతో పాటు విచ్చేసి భక్తుల సహాయ సహకారంతో ఈ ఉత్సవాలు విజయవంతంగా జరుగుతాయని భావిస్తున్నామన్నారు. యావత్ భారత దేశానికి జాతీయ సమైక్యతను చాటి చెప్పేలా సోదర భావానికి మత సామరస్యతకు విజయనగరం బాబామెట్ట ఒక వేదికగా ఈ ఉరుసు మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో ధర్మకర్త ఖలీల్ బాబు, టు టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.