Native Async

కేదార్నాథ్‌ దర్శనాలు బంద్‌… ఆలయం మూసివేతకు సన్నాహాలు

Kedarnath Temple Winter Closure 2025 – Last Day for Pilgrims to Witness Divine Darshan
Spread the love

హిమాలయ పరివాహక ప్రాంతంలో అత్యంత పవిత్ర క్షేత్రంగా భావించబడే శ్రీ కేదారనాథ్‌ ధామ్‌ ఆలయం రేపు ఉదయం 8.30 గంటలకు అధికారికంగా మూసివేస్తున్నారు. శీతాకాలంలో మంచు కురుస్తుంది కాబట్టి ఈ ఆలయాన్ని మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆలయాన్ని రంగురంగుల పువ్వులతో అందంగా అలంకరించారు. చివరిసారిగా భక్తులు పెద్ద సంఖ్యలో కేదారేశ్వరుడిని దర్శించుకొని తరించారు.

ప్రతి ఏడాది శీతాకాలం మొదలుకాగానే పెద్ద ఎత్తున మంచు కురుస్తుంది. ఫలితంగా కేదార్‌నాథ్‌ దేవాలయాన్ని దర్శించుకోవడం సాధ్యం కాదు. అందుకే కార్తీకమాసం ప్రారంభమైన రోజు దర్శనాలకు చివరి రోజు అవుతుంది. కార్తికమాసంలోని రెండో రోజు ఆలయం తలుపులు మూసివేస్తారు. ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి ఉదయం సుప్రభాత సేవ నిర్వహిస్తారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి వేద మంత్రోచ్ఛరణల మధ్య కేదారేశ్వరుని మూల విగ్రహాన్ని ఊరేగింపుగా ఉఖీమఠ్‌కు తరలిస్తారు. ఇక్కడే స్వామి భక్తులచేత శీతాకాలంలో పూజలు అందుకుంటారు.

కేదారనాథ్‌ ఆలయం ఈ సంవత్సరం మే 10న ప్రారంభం కాగా, ఆ రోజు నుంచే లక్షలాది మంది యాత్రికులు భక్తి ఉత్సాహంతో కష్టమైన హిమాలయ మార్గాన్ని అధిగమించి దర్శనానికి తరలివచ్చారు. గత కొన్నేళ్లుగా పునర్నిర్మాణ పనులు వేగవంతం కావడంతో సౌకర్యాలు మెరుగుపడటంతో యాత్రికుల సంఖ్య రెట్టింపు పెరిగింది.

ఈ రోజు రాత్రి ఆలయంలో దీపోత్సవం, పుష్పాంజలి, గర్భగుడి సర్వాంగ సుందర తైలాభిషేకాలతో ముగింపు శివార్చన కార్యక్రమాలు జరుగుతున్నాయి. రేపటి మూసివేతకు ముందు చివరి దర్శనంగా వేలాది మంది భక్తులు చల్లని గాలులు, మంచు తాకిడిని లెక్కచేయకుండా కేదారేశ్వరుని కటాక్షం కోసం ఇప్పటికే క్యూలైన్లలో నిలుచున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *