ఒక వయసు దాటాకా శరీరంలో ఆటోమేటిక్‌గా శక్తి తగ్గుతూ ఉంటుంది. తద్వారా వ్యాయామం చేయలన్నా ఆసక్తి కనిపించదు. రోజువారి పనులు కూడా తగ్గిపోతాయి. దీంతో తెలియకుండానే ఆహారం తీసుకునే విషయంపైనే దృష్టిసారిస్తారు. తద్వారా క్రమంగా బరువు పెరుగుతారు. ఇది వయసు 40 దాటిన తరువాత కనిపించే అంశం. తీసుకున్న ఆహారం జీర్ణమయ్యేందుకు అవసరమైన వ్యాయామాలు చేయకపోవడంతో జీవక్రియలు తగ్గిపోతాయి. ఫలితంగా ఆహారం జీర్ణమవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. 40 దాటిన తరువాత క్రమంగా మోనోపాజ్ దశకు చేరుతుంది.
హార్మోన్ల సమతుల్యత లోపించడం వలన కూడా బరువుపెరిగే అవకాశం ఉంటుంది. వయసుతో పాటు ఇన్సులిన్ హార్మోను ఉత్పత్తిలో మార్పులు వస్తాయి. దీని వలన కూడా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. వయసు పెరుగుతున్నా ఫిట్‌గా ఉండాలి అనుకుంటే చిరుతిండ్లను పక్కన పెట్టి బాదం, వాల్నట్స్, పొద్దుతిరుగుడు గింజలు వంటి వాటిని స్నాక్స్ రూపంలో తీసుకోవాలి. తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఫైబర్ ఫుడ్ తీసుకోవడం ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు.