•ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో స్వాతంత్ర్యం తరవాత విద్యుత్ వెలుగులు చూసిన రొంపల్లి పంచాయతీ పరిధిలోని ‘గూడెం’ గ్రామస్తులు
•కేంద్ర ప్రభుత్వ నిధులు, రాష్ట్ర విద్యుత్ శాఖ సాయంతో పనులు
•17 కుటుంబాలున్న గిరి శిఖర గ్రామానికి సుమారు 9.6 కిలో మీటర్ల మేర 217 విద్యుత్ స్తంభాలు
•ప్రతీ ఇంటికీ 5 బల్బులు, ఒక ఫ్యాన్ ఏర్పాటు
ప్రపంచానికి దూరంగా విసిరేసినట్టు అడవిలో ఉండే ‘గూడెం’ అనే గ్రామం అది. అల్లూరి సీతారామరాజు జిల్లా, అనంతగిరి మండలం, రొంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది. గూడెం గ్రామ ప్రజల ఇళ్ళలో నేటి వరకూ విద్యుత్ వెలుగులు లేవు. స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలైనా వారు పడుతున్న వెతలు బాహ్య ప్రపంచానికి తెలియవు. అలాంటి గిరిపుత్రుల సమస్యను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మనసుతో అర్థం చేసుకున్నారు. ఐదు నెలల్లోనే ఆ గిరిజన గ్రామంలో వెలుగులు నింపారు. గిరిపుత్రుల ముఖాల్లో ఆనంద కాంతులు వెల్లివిరిసేలా చేశారు. బుధవారం ఆ గ్రామంలో ఉన్న 17 ఇళ్ళకీ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. కార్తీక పౌర్ణమి రోజున బయట వెన్నెల కాంతులు… గూడెం ప్రజల ఇళ్ళలో విద్యుత్ కాంతులు విరుస్తున్నాయి.

• ఉప ముఖ్యమంత్రి కు వినతులు:
అల్లూరి సీతారామరాజు జిల్లా, అనంతగిరి మండలం, రొంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గూడెం గ్రామం ఉంది. మండల కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో 17 ఆవాసాలతో ఉంది ఆ గ్రామం. గూడెంలో నివసించే గిరిపుత్రులకు రోడ్లు, రక్షిత తాగునీరు, విద్యుత్ వంటి కనీస మౌలిక వసతులు అందటం లేదు. బాహ్య ప్రపంచంతో వీరి సంబంధాలు అంతంత మాత్రమే. పగటి వేళల్లో ఉపాధి కోసం బయటకు వచ్చే గూడెం గ్రామస్తులు, రాత్రిళ్లు బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీసేవారు. అడవి జంతువులు వచ్చి తమ ఊరి మీద పడతాయేమోనని భయంతో బతికేవారు. గతంలో ఎన్నోమార్లు అధికారులకు తమ సమస్యను చెప్పుకొన్నా పరిష్కారం లభించలేదు. అయిదు నెలల కిందట రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తమ సమస్యను తీసుకువచ్చారు. అడవితల్లి బాటతో గిరిపుత్రుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న మీరు మా గ్రామంలో విద్యుత్ కాంతులు నింపమంటూ కోరారు.

తన ముందుకు వచ్చిన సమస్యను పరిష్కరించి విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని అల్లూరి జిల్లా కలెక్టర్ కి స్పశతమ్ చేశారు. 17 ఆవాసాల కోసం 9.6 కిలోమీటర్ల పొడవునా అడవులు, కొండల్లో విద్యుత్ లైన్లు వేయాలి. సుమారు రూ. 80 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. దీంతో వారికో దారి చూపేందుకు ముందున్న దారులను పవన్ కళ్యాణ్ వెతికారు. ఈ సమస్యను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గొట్టిపాటి రవి కుమార్ గారికి, ఏపీ జెన్కో సీఎండీలకు తెలియచేశారు. అవసరం అయితే కేంద్ర ప్రభుత్వ సాయం తీసుకుని తక్షణం సమస్య పరిష్కరించాలని కోరారు. ఉపముఖ్యమంత్రి సూచనతో భారత ఇంధన మంత్రిత్వశాఖ పరిధిలోని నాన్ పీవీజీటీ పథకం ద్వారా ఆ గిరిజన గ్రామంలో విద్యుత్ శాఖ వెలుగులు నింపింది.

9.6 కి.మీ… 217 స్తంభాలు:
రూ. 80 లక్షల పైగా అంచనా వ్యయంతో సుమారు 9.6 కిలోమీటర్ల మేర, 217 విద్యుత్ స్తంభాలు వేసుకుంటూ వెళ్లి 17 ఆవాసాలకు విద్యుత్ సరఫరా ఇచ్చారు. ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా సోలార్ ప్యానళ్లు కూడా ఏర్పాటు చేసి ప్రత్యేక ట్రాన్స్ ఫార్మర్ కి అనుసంధానించారు.
గూడెం గ్రామానికి విద్యుత్ లైను వేసేందుకు విద్యుత్ శాఖ ఒక యజ్ఞమే చేసింది. విద్యుత్ స్తంభాల రవాణా, పాతడం వంటి పనులు అత్యంత క్లిష్ట పరిస్థితుల మధ్య పూర్తి చేశారు. మానవ వనరులను ఉపయోగించి స్తంభాలు రవాణా చేయడం, రాతి కొండలను తవ్వేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా మొదలు పెట్టిన 15 రోజుల్లోనే పనులు విజయవంతంగా పూర్తి చేశారు. పీఎం జన్మన్ పథకం కింద రూ.10.22 లక్షలతో సోలార్, పవన విద్యుత్ తో కూడిన హైబ్రిడ్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గిరిజన గ్రామాల్లో మొట్టమొదటిసారి ఈ తరహా గ్రిడ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఒక్కో ఇంటికీ ఐదు బల్బులు, ఒక ఫ్యాన్ కూడా అందించారు.

గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం గిరిజన ప్రజలు నివసించే శిఖర ప్రాంతంలో విద్యుత్ వెలుగులను నింపేలా నిధులు కేటాయించిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలియచేశారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తుందని చెప్పడానికి గూడెం గ్రామంలోని ఇళ్లకు విద్యుత్ సరఫరా చేయడమే నిదర్శనం అన్నారు. ఎన్నో సవాళ్లు ఎదుర్కొని గూడెం గ్రామంలో విద్యుత్ వెలుగులు నింపడానికి సహకరించిన విద్యుత్ శాఖ మంత్రి శ్రీ రవి గారికీ, ఏపీసీపీఎల్ ఛైర్మన్ ఇంకా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ పృథ్వి తేజకీ, విద్యుత్ శాఖ సిబ్బందికి ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు.

•గూడెం గ్రామంలో హర్షాతిరేకాలు:
కనీసం సౌకర్యాలు లేని, విద్యుత్ కాంతులు లేని గూడెం గ్రామ గిరిజనులు బుధవారం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ వేడుకగా ఉన్నారు. తమ గ్రామంలో మొట్టమొదటిసారి విద్యుత్ వెలుగులు చూసిన గూడెం ప్రజలు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. తమ గ్రామానికి విద్యుత్ లైను వేయించి, తమ ఇళ్ళలో విద్యుత్ కాంతులు నింపిన పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ గ్రామాన్ని యలమంచిలి శాసన సభ్యులు శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారు, అరకు నియోజక వర్గం జనసేన నాయకులు, జన సైనికులు సందర్శించారు. కనీసం రహదారి సౌకర్యం లేని ఆ గిరి శిఖర గ్రామానికి ట్రాక్టర్ సాయంతో ప్రయాణించి మరీ చేరుకున్నారు. ఆ గ్రామస్తుల ఆనందోత్సాహాల్లో భాగమయ్యారు.