ఎంత చదివినా…రామాయణం గురించి తెలుసుకోవాల్సింది ఇంకా ఇంకా ఉంటుంది. రామాయణంలో ప్రముఖ పాత్రలు సీతారామ లక్ష్మణులు, హనుమంతుడు, రావణ కుంభకర్ణులు. ఇందులోని ప్రతీ పాత్ర నుంచి మనిషి మంచో చెడో ఏదో ఒకటి తప్పకుండా నేర్చుకుంటాడు. నేర్చుకోవాలి కూడా. ఇప్పటి తరానికి పురాణాల గురించి తెలుసుకోవడం ఎంత అవసరమో విద్య గురించి తెలుసుకోవడం కూడా అంతే అవసరం. విద్య నేర్చుకున్న విద్యార్థి నిగర్విగా ఉండాలి. అలా కాకుండా విద్యను నేర్చుకున్న విద్యార్థికి గర్వం పెరిగి… ఆ విద్యను తప్పుగా ప్రదర్శిస్తే ఎలాంటి కీడు జరుగుతుంది… దాని వలన కలిగే దుష్ప్రయోజనాలేంటో కూడా రామాయణంలోని ఓ పాత్ర ద్వారా అంతర్లీనంగా చెప్పించాడు వాల్మీకి మహర్షి.
వేమన పద్యం
దొంగలు ఎత్తుకు పోరు దొరలు దోచుకుపోరు
పాత్రజనము వచ్చి పంచుకోరు
దానధర్మము చేయ తరుగునా పెరుగునా
విశ్వదాభిరామ వినుర వేమా
అనే పద్యం విద్యగురించి చక్కగా వివరిస్తుంది. విద్యను దానం చేసేకొలది పెరుగుతుంది తప్ప తరగదు. విద్యను జాతి ఉన్నతికి ఉపయోగించాలే తప్ప… వినాశనానికి… స్వప్రయోజనాలకు ఉపయోగించరాదు. విద్య వలన వినయం పెరగాలేగాని గర్వం పెరగరాదు. గర్వం పెరిగితే ఏమౌతుందో రామాయణంలో వాల్మీకి మహర్షి ఓ పాత్రద్వారా చక్కగా వివరించారు. ఆ పాత్రపేరు దశరధుడు. అయోధ్యను పరిపాలించిన సూర్యవంశపు రాజులలో దశరధుడికి గొప్ప రాజుగా పేరుంది. తన పరిపాలనా కాలంలో ప్రజలను కన్నబిడ్డలవలే చూసుకున్నాడు. తన బిడ్డలైన రామలక్ష్మణ భరత శత్రుఘ్నులను తనకు మించిన వారిగా తయారు చేశాడు. ఇదంతా ఒకెత్తైతే… విద్య నేర్చిన గర్వంతో దశరధుడు చేసిన ఓ తప్పిదం… తన మరణానికి కారణమైంది. ఏంటా తప్పిదం.
శబ్ధవిద్య
క్షత్రీయుడిగా దశరధుడు యుద్ధవిద్యలన్నింటినీ నేర్చుకున్నాడు. ఎవరూ నేర్చుకోని విద్యలను కూడా దశరధుడు తెలుసుకొని నేర్చుకున్నాడు. అదే శబ్దవిద్య. శబ్దాన్ని అనుసరించి బాణాలు వేయడం ఈ విద్య లక్షణం. రాత్రి సమయంలో అత్యవసర పరిస్థితుల్లో ఈ విద్యను ప్రదర్శిస్తారు. సాధారణంగా ఆ కాలంలో యుద్దాలు సూర్యోదయం నుంచి సూర్యస్తమయం వరకే జరిగేవి. సూర్యుడు అస్తమించాక యుద్దం చేయకూడదు. ఇది యుద్దనీతికి విరుద్దం. అందుకే రాత్రివేళల్లో అస్త్రవిద్యను ప్రదర్శించేందుకు అవకాశం అభించదు. అందుకే శబ్దవిద్యను ఆ కాలంలో పెద్దగా పట్టించుకునేవారు కాదు. కొందరే ఈ విద్యను నేర్చుకున్నారు. అయితే, ఈ విద్యను నేర్చుకున్న దశరధుడు తన ప్రావిణ్యాన్ని ప్రదర్శించాలనుకున్నాడు. కానీ, అది శాపంగా మారుతుందని ఏనాడు ఊహించలేదు.
యువరాజు దశరధుడు రాత్రి సమయంలో తన యుద్ధవిద్యను ప్రదర్శించాలనుకున్నాడు. అమావాస్య రోజున తన విద్యను అడవిలో ప్రదర్శించేందుకు సిద్దమయ్యాడు. ఓ చెట్టు మాటున కూర్చొని తన విద్యను ప్రదర్శించేందుకు సమాయాత్తమయ్యాడు. చుట్టుప్రక్కల నుంచి వస్తున్న శబ్దాలను జాగ్రత్తగా వినడం మొదలుపెట్టాడు. శబ్దాన్ని బట్టి అది పక్షా లేక జంతువా అని అంచనావేయసాగాడు. ఈలోగా కొద్ది దూరం నుంచి ఓ శబ్దం వినిపించింది. ఏనుగో, కౄరజంతువో అని భావించిన దశరధుడు ఆ దిశగా బాణం వేశాడు. ఆ తరువాత వచ్చిన శబ్దం విని నివ్వెరపోయాడు. పరుగుపరుగున అక్కడికి వెళ్లి చూసి ఆశ్చర్యపోయాడు. జరిగిన పొరపాటు తలచుకొని భోరుమన్నాడు. బాణం వేసింది నువ్వేనా అన్న మాటలు దశరధుడి హృదయాన్ని బలంగా తాకాయి. నోట మాటరాలేదు. ఏదో జంతువు అనుకొని బాణం వేశాను ఇలా జరుగుతుందని అనుకోలేదు…క్షమించమని అడిగాడు దశరధుడు.
వృద్ధుల ఆత్మార్పణం
తానో ముని కుమారుడని.. తన తల్లిదండ్రులు వృద్దులు…కదల్లేరు. వారికోసం నీళ్లు తీసుకెళ్లేందుకు వచ్చాను… నీ బాణానికి గురయ్యాను… నా తల్లిదండ్రులు దాహంతో ఉన్నారు… ఈ నీటిని వాళ్లకు అందజేయి… నేను లేనన్న సంగతి వాళ్లకు తెలియజేయి అని చెప్పి ఆ మునికుమారుడు కన్నుమూశాడు… కళ్లముందే ఘోరం జరిగిపోవడంతో దశరధుడికి ఏం చేయాలో పాలుపోలేదు… ముని దంపతులవద్దకు వెళ్లి జరిగిన విషయం చెబుతాడు. కుమారుడు లేడన్న విషయం తెలుసుకొని ఆ ముని దంపతులు విలపిస్తారు. తమకు తోడు నీడగా, అండగా ఉన్న కుమారుడిని అకారణంగా తన విద్యను ప్రదర్శించే నెపంతో హతమార్చినందుకు కోపంతో రగిలిపోయి… మాలాగే నీవు కూడా నీ కుమారుల ఎడబాటును తట్టుకోలేక మరణిస్తావని శపించి ఆపై చితిలో దూకి ఆత్మార్పణం చేసుకుంటారు ఆ మునిదంపతులు.
వనవాసం – దశరథుని మరణం
శ్రీరాముడికి పట్టాభిషేకాన్ని కైకేయి వ్యతిరేకించడం… రాముడిని కానలకు వెళ్లాలని దశరధుడు ఆజ్జాపించడం… రాముడి ఎడబాటును తట్టుకోలేక దశరధుడు శోకించి శోకించి మరణిస్తాడు. ఆనాడు అకారణంగా తన విద్యను ప్రదర్శించే నెపంతో ముని కుమారుడి మరణానికి కారణమయ్యాడని ముని దంపతులు ఇచ్చిన శాప ఫలితమే…శ్రీరాముడి ఎడబాటు… దశరధుడి మరణం. అందుకే అంటారు విద్యను ఎక్కడ ఎలా ప్రదర్శించాలో అలానే ప్రదర్శించాలి. గర్వంతో కూడిన విద్య ప్రదర్శన నాశనానికి హేతువు. ఇది దశరధుని శాపం కథ.