మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా??? తన అందం తో నటన తో ప్రేక్షకులను మెప్పించి తనకంటూ ఒక స్పెషల్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది…
భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా తన అందం, ప్రతిభతో గుర్తింపు తెచ్చుకున్న నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఇప్పుడు ఒక సీరియస్ లీగల్ విషయంలో వార్తల్లో నిలిచారు. ఇటీవల ఆమె దిల్లీ హైకోర్టును ఆశ్రయించి, తన పర్సనాలిటీ రైట్స్ రక్షణ కోరారు.
కారణం ఏమిటంటే—కొన్ని వెబ్‌సైట్లు ఆమె పేరు, ఫొటోలను అనుమతి లేకుండా ఉపయోగిస్తున్నాయి. అంతేకాదు, ఇవి కేవలం ఫేక్ న్యూస్ కాకుండా ఆన్‌లైన్ ఫ్రాడ్‌లో భాగమని, దీని వలన సెలెబ్రిటీల ఐడెంటిటీకి ముప్పు వాటిల్లుతుందని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఈ కేసు వాదనకు జనవరికి వాయిదా పడినా, కోర్టు మాత్రం తాత్కాలికంగా ఇంజంక్షన్ ఆర్డర్ ఇవ్వబోతుందని తెలుస్తోంది. జస్టిస్ కారియా మాట్లాడుతూ, “మీ కేసులో మొత్తం 151 URL లు ఉన్నాయి. ప్రతీ ఒక్క డిఫెండెంట్‌పై వేర్వేరుగా ఆర్డర్ ఇస్తాం. మీరు అడిగిన డిమాండ్స్ విస్తృతంగా ఉన్నా, ఇంజంక్షన్ మాత్రం ప్రత్యేకంగా ఇస్తాం” అని స్పష్టం చేశారు. అలాగే, ఐశ్వర్యరాయ్ ఈ ఆర్డర్‌ను జాన్ డో డిఫెండెంట్స్‌కు కూడా వర్తింపజేయాలని కోర్టును అభ్యర్థించారు. (జాన్ డో ఆర్డర్ అంటే గుర్తు తెలియని భవిష్యత్తులో ఇలాంటి ఉల్లంఘనలు చేసే వారికి కూడా వర్తించే న్యాయపరమైన రక్షణ.)
గతంలోనూ పలువురు సెలెబ్రిటీలు తమ వ్యక్తిగత హక్కులు, ఇమేజ్ రైట్స్ కాపాడుకునేందుకు కోర్టును ఆశ్రయించిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఐశ్వర్యరాయ్ వంటి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నటి ఈ విషయంలో ముందుకు రావడంతో, మళ్లీ ఈ అంశం సినీ వర్గాల్లోనూ, న్యాయవర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.