ఇప్పటి యువత చికెన్, మటన్ కంటే చేపలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. కానీ అన్ని చేపలు ఆరోగ్యానికి మంచివి కావు. అయితే కొర్రె మీను లేదా స్నక్ హెడ్ ముర్రెల్ (Viral Fish) మాత్రం నిజంగా ఆరోగ్యానికి వరం అంటున్నారు నిపుణులు. చిత్తడి ప్రాంతాల్లో ఎక్కువగా దొరికే ఈ చేప ప్రత్యేకత ఏంటంటే — నీరు లేకున్నా భూమిపై కొంతకాలం జీవించగలగడం! అంతే కాదు, దీనిలో ఎముకలు తక్కువగా ఉండటంతో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరైనా సులభంగా తినవచ్చు.
ఈ చేపలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్, విటమిన్‌లు, కాల్షియం, భాస్వరం, ఐరన్, సెలీనియం, పొటాషియం వంటి పుష్కల పోషకాలు ఉన్నాయి. అందువల్ల ఇది కండరాల పెరుగుదలకే కాకుండా ఎముకలను దృఢంగా చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతూ రక్తపోటు నియంత్రణలో ఉంచుతుంది.
డెల్టా జిల్లాల్లో ఈ చేపకు భారీ డిమాండ్ ఉండటానికి ఇదే కారణం. మార్కెట్లో మాంసం కంటే ఎక్కువ ధర పలికినా, ఆరోగ్యానికి ఇచ్చే లాభం దానికి మించి ఉంటుంది. అందుకే ఇప్పుడు ప్రజల మాట — “చికెన్ వద్దు… కొర్రె మీనే ముద్దు!”