ఆంధ్రప్రదేశ్ లో జూదం ఆడటం, జూద కేంద్రాలు నిర్వహించడం, ప్రోత్సహించడం నేరం. ఆన్లైన్ లేదా ఆఫ్ లైన్ లో వీటిని నిర్వహించినా, ఆడినా ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ – 1974 ప్రకారం శిక్షార్హులు అవుతారు అని చట్టం చెబుతోంది. రాష్ట్రంలో చట్ట విరుద్ధంగా జూద కేంద్రాలు సాగుతున్నాయని ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. పేకాట క్లబ్బుల నిర్వహణపై ఆ ఫిర్యాదుల్లో తెలిపారు.
కొందరు పెద్దలు పేకాట కేంద్రాలను నిర్వహిస్తూ, నెలవారి మామూళ్లను అధికారులకు అందజేస్తున్నారనే ఆరోపణలు అధికంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై నిజానిజాలు తెలుసుకునేందుకు, పోలీసు అధికారులకు దీనిపై ఉన్న సమాచారం తెలుసుకునేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీనిపై ఆరా తీశారు. ఒకవేళ పోలీసు అధికారుల దృష్టికి వచ్చిన వివరాలు, దానిపై తీసుకున్న చర్యలను నివేదిక రూపంలో తెలియజేయాలని ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర డీజీపీకి స్పష్టం చేశారు.