మహిళల భద్రత కోసం మగవారు ముందుకు రావాలి: ‘Stand With Her’ క్యాంపెయిన్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy Launches ‘Stand With Her’ Campaign, Urges Men to Support Women Safety

సమాజంలో మహిళల రక్షణ కోసం మగవారే బ్రాండ్ అంబాసిడర్లుగా నిలబడాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. ఫిర్యాదులు, కేసుల నమోదుతో పాటు మహిళల భద్రతను ఒక సామాజిక బాధ్యతగానూ భావించాలన్నారు.

Image

❇️ ఆడపిల్లలను ఎవరైనా ఇబ్బందికి గురిచేసినప్పుడు నిలబడి ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని యువతకు ముఖ్యమంత్రి గారు సూచించారు. వేధింపులను చూసి చూడనట్టు ఉండటం కూడా నేరాన్ని ప్రోత్సహించడమే అవుతుందని హితవుపలికారు. సొంత కుటుంబ సభ్యులకు ఎక్కడైనా వేధింపులు ఎదురైతే ఏ విధంగా స్పందిస్తామో, ఇతర ఆడపిల్లల విషయంలోనూ అదే తీరుగా ఆలోచించాలన్నారు.

❇️ #Hyderabad జేఎన్‌టీయూ క్యాంపస్ ఆడిటోరియంలో తెలంగాణ పోలీస్ మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన “స్టాండ్ విత్ హర్” క్యాంపెయిన్ ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. Stand With Her క్యాంపెయిన్ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. మహిళల భద్రత, గౌరవం, సమానత్వాన్ని కాపాడడంలో పురుషులు బాధ్యతాయుతమైన పాత్ర పోషించాల్సిన అవసరాన్ని తెలియజేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన #WomenSafety విభాగాన్ని ముఖ్యమంత్రి గారు అభినందించారు.

❇️ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, మహిళల భద్రతతో పాటు వారి ఆర్థిక స్వావలంబన కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.

❇️ “అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంలో కేవలం కార్యక్రమాల నిర్వహణతో బాధ్యత తీరిపోయినట్టు కాదు. మహిళను శక్తితో పోల్చుతాం. మహిళలను కుటుంబ గౌరవంగా భావిస్తాం. అలాంటిది మహిళలు నిత్యం అభద్రతా భావంతో బయటికి వెళ్లాల్సిన పరిస్థితులు ఉండకూడదు. ఈ దుస్థితిని నివారించేలా మనల్ని మనం సవరించుకోవాల్సిన సమయం వచ్చింది.

❇️ ఒక మహిళ సారథ్యంలో ఉన్న పార్టీ ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వాన్ని నడుపుతోంది. దేశ స్వతంత్రానికి ముందు, ఆ తర్వాత కూడా మహిళలకు కీలక పదవులు, బాధ్యతలు కట్టబెట్టిన చరిత్ర మా పార్టీకి ఉంది. నాడు తెలంగాణ ఏర్పాటులోనూ మహిళామణులే కీలకంగా వ్యవహరించారు. మహిళల శక్తిసామర్థ్యాల పట్ల మా ప్రభుత్వానికి బలమైన నమ్మకం ఉంది.

❇️ ప్రస్తుతం తెలంగాణ పోలీస్ శాఖలోని కీలక విభాగాలకు, ప్రభుత్వంలోని ముఖ్యమైన శాఖలకు మహిళలే అధికారిణులుగా ఉన్నారు. ఆడబిడ్డలు సామాజికంగా, ఆర్థికంగా బలోపేతమైతేనే ఆ రాష్ట్రం లేదా దేశం పురోగతి సాధించినట్టుగా భావించాలి.

❇️ తెలంగాణలో ఓవైపు మహిళా భద్రతకు ప్రాధాన్యం ఇస్తూనే, ఆర్థిక స్వావలంబన దిశగా మహిళ కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నాం. ఇందిరమ్మ ఇండ్లు, వడ్డీలేని రుణాలు మహిళల పేరుమీదే ఇస్తున్నాం. సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు, ఆర్టీసీ బస్సులకు వారిని యజమానులుగా చేస్తున్నాం.

❇️ తెలంగాణ గ్రామీణ మహిళలు తయారు చేసే ఉత్పత్తులను అంతర్జాతీయంగా విక్రయించేలా అమెజాన్ వంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాం. మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ గారి పేరు పెట్టుకున్నాం. తెలంగాణ రాష్ట్రానికి ఆడబిడ్డనే స్పూర్తిగా ఉండాలని ‘తెలంగాణ తల్లి’ మూర్తులను ప్రతిష్టించుకున్నాం.

❇️ తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లక్ష్య సాధనలో మహిళల ముందడుగే కీలకం. మహిళలు ఆర్థిక ప్రగతి సాధించడంతోనే తెలంగాణ రాష్ట్రం 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందుతుంది. మహిళలకు సంపూర్ణ భద్రత కల్పించడంతోనే ఇవన్నీ నెరవేరుతాయి.

❇️ గతంలో కొన్ని ప్రాంతాల్లోనో, బహిరంగ ప్రదేశాల్లో మహిళలకు వేధింపులు ఎదురయ్యేవి. కానీ ఈరోజుల్లో ఫిజికల్ క్రైమ్ కంటే ఆన్‌లైన్ క్రైమ్ పెరిగిపోయింది. డీప్ ఫేక్ వీడియోలు తయారు చేస్తున్నారు. వీటిని నియంత్రించడానికి తెలంగాణ సైబర్ క్రైమ్ విభాగాన్ని కూడా పటిష్టం చేశాం.

❇️ ఏదైనా జరిగినప్పుడు అమ్మాయిదే తప్పు అని నిందలు వేసే చెడు సంప్రదాయాన్ని మనం వదులుకోవాలి. ఇబ్బందుల్లో ఉన్న మహిళల కోసం ‘స్టాండ్ విత్ హర్’ అనే నినాదం తీసుకొని వారికి అండగా నిలబడాలి” అని ముఖ్యమంత్రి గారు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *