పార్టీ నుంచి సస్పెండ్ అయిన తరువాత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రెస్‌మీట్‌ను నిర్వహించారు. ఈ ప్రెస్‌మీట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీమంత్రి హరీష్‌రావు, పార్టీ నేత సంతోష్ రావులు టార్గెట్‌గా మాట్లాడారు. గతంలో ఓ సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్‌రావులు ఒకే విమానంలో ప్రయాణం చేశారని, హరీష్‌రావు రేవంత్ కాళ్లు పట్టుకున్నాకే తనపై కుట్రలు ప్రారంభమయ్యాయని ఆరోపించారు. హరీష్‌రావు తనకున్న పాల వ్యాపారాన్ని విస్తరించి అధికారంలోకి రాగానే హాస్టళ్లకు పాలు సరఫరా చేశారని ఆరోపించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి లక్ష కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్టుగా చెబుతూ కేసీఆర్‌ను టార్గెట్ చేస్తున్నారేగాని, హరీష్‌రావు గురించి మాట్లాడటం లేదని ఆరోపించారు. కేసీఆర్‌పై సీబీఐ విచారణకు వచ్చిందంటే అందుకు హరీష్‌రావు, సంతోష్‌లే కారణమని అన్నారు.
హరీష్‌రావు ట్రబుల్ షూటర్ కాదని, డబుల్ షూటర్ అని, ఆయనతో జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్‌కు కవిత సూచించారు. ఇక కేసీఆర్ టీడీపీ నుంచి బయటకు వచ్చే సమయంలో ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారని అన్నారు. హరీష్‌రావు కట్టప్పతో పోలుస్తున్నారని, ఒక దశలో ఆయన ఎమ్మెల్యేలను తన పక్కన పెట్టుకొని పార్టీని విడదీయాలని చూశారని, తన ప్రాణం పోయినా కేసీఆర్‌కు అన్యాయం జరగనివ్వనని చెప్పారు. తనపై ఎందుకు ఇన్ని కుట్రలు, ఎందుకింత అవమానిస్తున్నారో అర్థం కావడం లేదని వాపోయారు. కాగా, కవిత చేసిన ఈ సంచలన వ్యాఖ్యలపై హరీష్‌రావు, సంతోష్‌లు ఎలా స్పందిస్తారో చూడాలి.