ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఖరారయ్యింది. అక్టోబరు 6న అమ్మవారి తొలేళ్ల ఉత్సవం, 7న సిరిమానోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కె.శిరీష, సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు తెలియపరిచారు. అమ్మవారి దేవస్థానం కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఉత్సవ వివరాలను వెళ్లడించారు.
పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు సెప్టెంబరు 12న పందిరాటతో శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. ఆరోజున చదురగుడి వద్ద ఉదయం 9.30 గంటలకు, వనం గుడివద్ద 11 గంటలకు పందిరి రాట వేస్తామని చెప్పారు. అదేరోజున మ్మవారి మండల దీక్ష ఉదయం 8 గంటలకు చదురగుడి వద్ద ప్రారంభిస్తామన్నారు. అక్టోబరు 2న అర్ధమండల దీక్ష ప్రారంభమవుతుందన్నారు. 6వ తేదీ సోమవారం తొలేళ్ల ఉత్సవం, 7వ తేదీ మంగళవారం సిరిమానోత్సవం జరుగుతుందని తెలిపారు. పెద్ద చెరువులో 14న తెప్పోత్సవాన్ని, 19వ తేదీ ఆదివారం కలశజ్యోతి ఊరేగింపు వనం గుడివద్ద సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమవుతుందని చెప్పారు. 21వ తేదీన ఉయ్యాల కంబాల ఉత్సవాన్ని నిర్వహిస్తామని, 22న చండీహోమం, పూర్ణాహుతితో పైడిమాంబ ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు. అదేరోజు అమ్మవారి దీక్షదారులు దీక్ష విరమణ చేస్తారని చెప్పారు. ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఈఓ శిరీష, పూజారి వెంకటరావు కోరారు. విలేకర్ల సమావేశంలో ఆలయ సూపరింటిండెంట్ వైవి రమణి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ముఖ్యమైన తేదీలు
అమ్మవారి పందిరిరాట: సెప్టెంబరు 12
తొలేళ్ల ఉత్సవం: అక్టోబరు 06
సిరిమానోత్సవం: అక్టోబరు 07
తెప్పోత్సవం: అక్టోబరు 14
ఉయ్యాల కంబాల: అక్టోబరు 21