తిరుమలలో అనూహ్యంగా పెరిగిన రద్దీ…దర్శనానికి 24 గంటల సమయం

Unexpected Surge in Tirumala Crowds 24-Hour Wait Time for Darshan
Spread the love

తిరుమలలో రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఆషాఢంలో సాధారణంగా భక్తుల రద్దీ తక్కువగా ఉంటుంది. కానీ, ఈ ఏడాది పాఠశాలలు ప్రారంభమైనప్పటికీ, ఆషాఢం నడుస్తున్నప్పటికీ తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య అపారంగా పెరిగిపోతున్నది. ఆదివారం అంటే జులై 13వ తేదీన తిరుమల గిరులు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆదివారం ఒక్కరోజే 80,193 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్టుగా టీటీడీ అధికారులు తెలియజేశారు. ఇక 33,298 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించినట్టుగా అధికారులు తెలిపారు. ఆదివారం రోజున హుండీ ద్వారా 4.43 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. సాధారణ భక్తుల దర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతున్నట్టుగా అధికారులు తెలిపారు. ఇక శనివారం రోజున రికార్డుస్థాయిలో భక్తులు శ్రీవేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. శనివారంనాడు స్వామిని 92,221 మంది భక్తులు దర్శనం చేసుకోగా, 42,280 మంది భక్తులు స్వామికి తలనీలాలు సమర్పించారు. ఇక హుండీ ద్వారా 3.51 కోట్ల రూపాయల ఆదాయం లభించినట్టు అధికారులు తెలిపారు. రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అటు అధికారులు కూడా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూలైన్లో ఉన్నవారికి అన్నపానీయాలు అందజేస్తున్నారు. క్యూకాంప్లెక్సులో ఉన్న వారికి కూడా ఆహారాన్ని అందిస్తూ ఎటువంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *