బ్యాగులుగా మారుతున్న బొంతలు… ఇప్పుడిదే నయాట్రెండ్‌

చలికాలంలో పిల్లలు వెచ్చగా పడుకోవడానికి పాత చీరల్ని ఒకచోటకు చేర్చి బొంతలుగా కుడతారు. అయితే, ఇప్పుడు ఆ బొంతలే ఫ్యాషన్‌ ప్రపంచంలో బ్యాగులుగా రాణిస్తున్నాయి. ఇవేమి కొత్త కాదు. పాతకు కొత్తదనం చేర్చి సరికొత్తగా మారుస్తున్నారు. 18వ శతాబ్ధం నుంచే ఇలాంటి బ్యాగులను వాడుతున్నా…మధ్యలో పలు రకాలైన ఫ్యాషన్‌ బ్యాగులు అందుబాటులోకి రావడంతో అవి మరుగున పడ్డాయి. కానీ, డిజైనర్లు పాతవాటికి మెరుగులు దిద్దడంతో మరోసారి ఫ్యాషన్‌ రంగాన్ని ఏలబోతున్నాయి. క్విల్టెడ్‌ బ్యాగ్స్‌గా ఆకట్టుకుంటున్నాయి. ప్రముఖ ఫ్యాషన్‌ డిజైన్‌ సంస్థ షనెల్‌ ఈ బ్యాగులను టైమ్‌లెస్‌ డిజైన్‌గా పేర్కొన్నది.

పర్సుల దగ్గరి నుంచి హ్యాండ్‌బ్యాగ్స్‌, ల్యాప్‌ట్యాప్‌ బ్యాగ్స్‌ వరకు అన్ని రూపాల్లోనూ బొంత బ్యాగులు దర్శనం ఇస్తున్నాయి. డిజైనర్‌వేర్‌లో బొంతబ్యాగులు లభ్యమౌతుండటంతో… వీటి ధర కూడా కాస్త ఎక్కువగానే ఉంటోంది. అయితే, ఫ్యాషన్‌వేర్‌లోనే కాదు…ఇప్పడు సాధారణ మార్కెట్లో కూడా ఈ బొంతబ్యాగులు ట్రెండీగా మారాయి. సాధారణ మార్కెట్లో ఈ బ్యాగులు మనకు కనివిందు చేస్తున్నాయి. సో, మీదగ్గర బామ్మలకాలం నాటి బొంతలు ఉంటే పారేయకుండా ఫ్యాషన్‌కు తగినట్టుగా బ్యాగులుగా కుట్టించుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *