•ఇప్పటంలో శ్రీమతి ఇండ్ల నాగేశ్వరమ్మ గారి ఇంటికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
•యోగక్షేమాలు తెలుసుకుని… అండగా ఉంటానని భరోసా…
•రూ. 50 వేల ఆర్థిక సాయం.. మనుమడి చదువులకు రూ. లక్ష అందజేత
•శ్రీమతి నాగేశ్వరమ్మ పోషణకు తన జీతం నుంచి ప్రతి నెలా రూ. 5 వేలు
‘అమ్మా నీ పెద్ద కొడుకుని వచ్చా.. నిన్ను చూడడానికి వచ్చా.. బాగున్నావా.. నీ ఆరోగ్యం ఎలా ఉంది.. నాలుగు రోజులుగా నిన్ను చూసేందుకు వద్దామంటే ఆధికారిక కార్యక్రమాల వల్ల వీలుపడలేదు.. నీకిచ్చిన మాట కోసం ఈ రోజు పనులన్నీ వాయిదా వేసుకుని నీ కోసం వచ్చా..’ మంగళగిరి నియోజకవర్గం, ఇప్పటం గ్రామానికి చెందిన వృద్ధురాలు శ్రీమతి ఇండ్ల నాగేశ్వరమ్మ గారి ఇంటికి వెళ్లిన సందర్భంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆమెను ఆప్యాయంగా అక్కున చేర్చుకుని పలకరించారు.

గత ప్రభుత్వ హయాంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభకు భూములు ఇచ్చారన్న అక్కసుతో ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతల సమయంలో గత పాలకుల దాష్టికాలకు ఎదురు నిలచిన శ్రీమతి నాగేశ్వరమ్మ గారు నా బిడ్డ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వస్తాడు.. మీ బెదిరింపులకు భయపడం అంటూ రోడ్డెక్కారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా ఆ గ్రామానికి వెళ్లి అందరికీ భరోసా ఇచ్చారు. శ్రీమతి నాగేశ్వరమ్మ గారి ఇంటి కొడుకుగా అండగా నిలుస్తాను అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆ సందర్భంలో – గెలిచిన తరవాత తన ఇంటికి రావాలని శ్రీమతి నాగేశ్వరమ్మ గారు కోరారు. ఆమెకు ఇచ్చిన మాట మేరకు బుధవారం శ్రీమతి నాగేశ్వరమ్మ గారి ఇంటికి వెళ్లి ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులందరినీ పేరుపేరునా పలుకరించారు.

•సంక్రాంతికి చీర, ఖర్చులకు రూ. 50 వేల ఆర్థిక సాయం:
ఆ ఇంటికి కుమారుడిగా శ్రీమతి నాగేశ్వరమ్మ గారికి సంక్రాంతి పండుగ కానుకగా చీర బహూకరించారు. ఖర్చుల నిమిత్తం మరో రూ. 50 వేలు ఆర్థిక సాయం అందజేశారు. మాటల మధ్యన ఈ రోజుకీ కుటుంబ పోషణ నిమిత్తం పొలం పనులకు వెళ్తున్నట్టు శ్రీమతి నాగేశ్వరమ్మ గారు చెప్పారు. ప్రతి నెలా తన జీతం నుంచి పిఠాపురంలో అనాథ చిన్నారులకు ఇచ్చిన విధంగా రూ. 5 వేలు పోషణ నిమిత్తం ఇంటికి పంపనున్నట్టు తెలిపారు. దివ్యాంగుడైన శ్రీమతి నాగేశ్వరమ్మ గారి మనుమడు మనోజ్ సాయి చదువుల నిమిత్తం రూ. లక్ష సాయం చేశారు. ఆమె కుమారుడు శ్రీ కొండయ్య క్యాన్సర్ తో బాధపడుతున్న విషయం తెలుసుకుని చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 3 లక్షలు ఇచ్చారు. నీ ఆరోగ్యం జాగ్రత్త అమ్మా అని చెప్పి అక్కడి నుంచి వెనుదిరిగారు.

•అద్యంతం ప్రజల్లో మమేకం.. పూలవర్షంతో స్వాగతించిన జనం:
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పటం వస్తున్నారని తెలుసుకున్న ప్రజలు దారి పొడవునా ఘన స్వాగతం పలికారు. కొలనుకొండ, ఇప్పటం గ్రామాల్లో రోడ్లకు ఇరువైపులా నిలబడి హారతులు పడుతూ, పూల వర్షం కురిపించారు. ఇప్పటం నుంచి తిరుగు ప్రయాణంలో ప్రజలతో మమేకం అయ్యారు. పూలతోటల్లో పని చేస్తున్న కూలీలను పలుకరించారు. రోజుకి ఎన్ని పూలు కోస్తారని ఆరా తీశారు. ఒక్కొక్కరు రెండు కేజీల నుంచి మూడు కేజీలు పూలు కోస్తామని తెలిపారు. కొలనుకొండలో శ్రీమతి నిర్మల అనే మహిళ తమ ఇళ్ల వద్ద కరెంటు పోల్ కావాలని అడుగగా, తక్షణం ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. పింఛన్లు ఇప్పించాలని పలువురు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు విన్నవించగా, ఆ విజ్ఞప్తులను పరిష్కరించే బాధ్యతను పేషీ అధికారులకు అప్పగించారు.