భారతీయ వైద్యశాస్త్రం అంటేనే ఆయుర్వేదం. ఆయుర్వేదంలో వాడే ప్రతి వస్తువు ఓ అద్భుతం అనే చెప్పాలి. ప్రకృతిలో సహజసిద్దంగా లభించే వాటితోనే ఆయుర్వేదం మందులు తయారవుతాయి. వైద్యపరంగానే కాకుండా కొన్నింటిని మనం మామూలుగా అయినా తీసుకోవచ్చు. ఆహారంలో భాగం చేసుకోవచ్చు. ఆరోగ్యాన్ని పొందవచ్చు. అటువంటి వాటిల్లో ఒకటి మనకు బాగా తెలిసినది కరక్కాయ. రుచికి చేదుగా, వగరుగా ఉన్న ఇందులో ఆరోగ్యానికి సంబంధించిన ఔషధగుణాలు ఎన్నో ఉన్నాయి. కరక్కాయను మనం రోజూ కొద్దిగా తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలున్నాయో, ఆరోగ్యపరంగా మనం ఎంత ఉన్నతిని సాధించవచ్చో ఈ కథనంలో తెలుసుకుందాం.
జీర్ణవ్యవస్థకు దివ్యౌషధం
కరక్కాయను తినడం వల్ల మన జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. కరక్కాయ జీర్ణక్రియను పెంపొందిస్తుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది. విరేచనం సాఫీగా అయ్యేలా చేస్తుంది. గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. శరరీంలోని వ్యర్థాలు, టాక్సిన్లను బయటకు పంపుతుంది. దీని వల్ల అనేక రోగాల బారి నుంచి బయట పడవచ్చు. ఆరోగ్యంగా ఉంటారు. కరక్కాయను తరచూ తీసుకుంటే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రోగ నిరోధక వ్యవస్థ బలంగా మారుతుంది.
వాపును నొప్పుల నుంచి ఉపశమనం
కరక్కాయను రోజూ కొద్ది మోతాదులో తీసుకుంటే శరీరంలోని వాపులు తగ్గిపోతాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్, గౌట్ వంటి జబ్బులతో బాధపడేవారికి కరక్కాయ మంచి మేలు చేస్తుంది. అంతేకాదు, కరక్కాయ శ్వాసకోశ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. దగ్గు, ఆస్తమా వంటి సమస్యలను బయటపడేస్తుంది. అంతేకాదు, గుండె సంబంధిత జబ్బులతో బాధపడేవారికి కరక్కాయ ఎంతో మేలు. కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను తగ్గించి రక్తనాళాల్లో రక్తం సాఫీగా ప్రసరించేలా చేస్తుంది. గుండెకు సంబంధించిన కండరాలను బలంగా మారేలా చేస్తుంది.
కాలేయం ఆరోగ్యం
మనిషి జీవితం సాఫీగా సాగిపోవాలంటే కాలేయం ఆరోగ్యంగా ఉండాలి. ఈరోజుల్లో కాలేయాన్ని అత్యంత దయనీయంగా మార్చేస్తున్నారు. కాలేయం దెబ్బతింటే జీవితం కుంటుపడుతుంది. లీవర్‌ను శుభ్రం చేయడంలో కరక్కాయ అద్భుతంగా పనిచేస్తుంది. వ్యర్థాలను, టాక్సిన్లను బయటకు పంపడంలో కరక్కాయ బెస్ట్. ఫ్రీరాడికల్స్, టాక్సిన్ల బారి నుంచి కాపాడుతుంది. చర్మాన్ని రక్షించడంలో కరక్కాయకు మించింది లేదు. అంతేకాదు, మొటిమలు, గజ్జి, తామర, సొరియాసిస్ వంటి చర్మ సమస్యలకు కరక్కాయ సూపర్‌గా పనిచేస్తుంది. వృద్దాప్య ఛాయలను దూరం చేస్తుంది. ముఖంపై ఉండే ముడతలు, మచ్చలను కరక్కాయ నివారిస్తుంది. పొడిగా చేసుకొని లేదా చిన్న ముక్కలుగా చేసుకొని కరక్కాయను తీసుకోవచ్చు.