అధికారంలోకి రావడానికి ఎంత కష్టపడ్డారో… దానిని నిలబెట్టుకోవడానికి మరింతగా కష్టపడాలి. మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు నాలుగింతలు కష్టపడాలి. విజయం కోసం ఎన్నిదారులు ఉన్నాయో అన్ని దారుల్లోనూ ప్రయత్నించాలి. చివరి క్షణం వరకూ ఓటమిని అంగీకరించకూడదు. పోరాడి ఓడిపోతే నష్టం లేదు. పోరాటంలో వెనకడుగు వేయకూడదు.
కాంగ్రెస్ పార్టీకి చాలా కాలం తరువాత తెలంగాణలో అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 2023 లో అధికారం చేపట్టింది. అధికారం చేపట్టిన తరువాత తెలంగాణలో అన్ని పార్టీలు మౌనం పాటిస్తున్నాయి. రాజకీయంగా ఏ పార్టీకూడా పెద్దగా స్పందించడం లేదు. అందరూ తమ లోపాలను సరిదిద్దుకునే పనిలో ఉన్నారు.
అయితే కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు బహువిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నది. ఇందులో భాగంగా ఎన్నికలకు ముందు బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. ఈ డిక్లరేషన్ లో పేర్కొన్న అంశాలను, ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని, తమను మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సదస్సును నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు ప్రకటించారు, దీనిపై ఈ పార్టీ తెలంగాణ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నది.
ఈ సమావేశానికి మంత్రులు పొన్నం, పొంగులేటి, సీతక్క, ప్రభుత్వ సలహాదారులు పాల్గొంటున్నారు. ఈసారి ఎన్నికల్లో కామారెడ్డి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ కానున్నది. కరీంనగర్, నిజామాబాద్, కామారెడ్డి తదితర ప్రాంతాల్లో బీజేపీ బలపడుతున్న నేపథ్యంలో ఆ పార్టీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది.