తెలుగు సినిమా అంటే నేడు ప్రపంచవ్యాప్తంగా ఒక బ్రాండ్. కానీ, సరిగ్గా 55 ఏళ్ల క్రితమే మన తెలుగు జెండాను అంతర్జాతీయ యవనికపై రెపరెపలాడించిన ఘనత సూపర్ స్టార్ కృష్ణకే దక్కుతుంది. నేడు మనం ‘పాన్ ఇండియా’, ‘పాన్ వరల్డ్’ అనే పదాలను వాడుతున్నాం, కానీ అప్పట్లోనే 50 దేశాల్లో తన సినిమాను విడుదల చేసి ‘ఒరిజినల్ పాన్ వరల్డ్ స్టార్’ అనిపించుకున్నారు కృష్ణ. ఆ అద్భుత దృశ్యకావ్యమే ‘మోసగాళ్లకు మోసగాడు’.
1971లో విడుదలైన ఈ చిత్రం భారతీయ సినీ చరిత్రలో ఒక విప్లవం. అప్పట్లో మద్రాసులో హాలీవుడ్ కౌబాయ్ సినిమాలు ఆడుతుంటే, కృష్ణగారికి ఒక ఆలోచన వచ్చింది.”మన వాళ్లు హాలీవుడ్ సినిమాలను చూసి ఆనందిస్తున్నప్పుడు, మనమే ఒక కౌబాయ్ సినిమా తీస్తే ఎలా ఉంటుంది?” అని. అలా పుట్టిందే ఈ ప్రాజెక్టు. హాలీవుడ్ క్లాసిక్ ‘ది గుడ్, ది బ్యాడ్ అండ్ ది అగ్లీ’ స్ఫూర్తితో, రచయిత ఆరుద్ర మన నేటివిటీకి తగ్గట్టుగా అద్భుతమైన కథను అల్లారు.
అప్పట్లో 8 లక్షల రూపాయల భారీ బడ్జెట్‌తో (నేటి కాలంలో ఇది కొన్ని వందల కోట్లతో సమానం), తన సొంత బ్యానర్ పద్మాలయ స్టూడియోస్‌పై రాజస్థాన్ ఎడారుల్లో ఈ సినిమాను నిర్మించారు. గుర్రపు స్వారీలు, గన్ ఫైట్లు, నిధి వేట… ఇవన్నీ అప్పట్లో ప్రేక్షకులకు ఒక కొత్త లోకాన్ని చూపించాయి. ఫలితం? కేవలం 8 లక్షలతో తీసిన ఈ సినిమా అప్పట్లోనే 50 లక్షల గ్రాస్ వసూలు చేసి రికార్డు సృష్టించింది.
అయితే కృష్ణగారు అక్కడ ఆగిపోలేదు. ఈ సినిమాలోని పాటలను తొలగించి, ‘ది ట్రెజర్’ (The Treasure) పేరుతో ఇంగ్లీష్‌లోకి డబ్ చేయించి ఏకంగా 50 దేశాల్లో విడుదల చేశారు. తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన తొలి సాహసి కృష్ణ. అందుకే టెక్నికల్ ప్రయోగాలకైనా, సాహసోపేతమైన జానర్లకైనా కృష్ణగారే తెలుగు సినిమాకు మార్గదర్శి. ఈ సినిమా ద్వారా ఆయన వేసిన పునాదే నేటి ‘ఆర్.ఆర్.ఆర్’ లేదా ‘బాహుబలి’ వంటి చిత్రాలకు స్ఫూర్తి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.