దేశం సాధించిన గొప్ప విషయం గురించే మనం చెప్పుకోబోతున్నాం. భారత దేశంలో ఉన్న ఎన్నో గొప్ప శిల్ప కళ గురించి ఈ కథనంలో మనం చర్చించుకోబోతున్నాం. సాధారణ ప్రజలకు నల్లనిరాయి చూస్తే ఇంటికి అవసరమైన వస్తువుగా ఉపయోగించుకుంటారు. అదే ఓ భక్తుడికి కనిపిస్తే భగవంతుడిగా భావించి పూజలు చేస్తాడు. కానీ, ఓ శిల్పికి నల్లని రాయి కనిపిస్తే అందులో అద్భుతమైన శిల్పాన్ని దర్శిస్తాడు. ఆయన మనో ఫలకంపై దర్శించిన చిత్రాన్ని అందరికీ కనిపించేలా చేస్తాడు. వెయ్యేళ్లపాటు శిల్పాన్ని దర్శించుకునే భాగ్యాన్ని కల్పిస్తాడు. మనం బాల్యం నుంచి శిల్పాల గురించి శిల్పకళ గురించి పుస్తకాల్లో చదువుకొని ఉన్నాం. ఊహించుకొని ఆహా ఓహో అనుకున్నాం.
కానీ, వాస్తవంగా చదివిన వాటిని ప్రత్యక్షంగా చూస్తే ఆ అనుభూతి వేరుగా ఉంటుంది. ఖచ్చితంగా రెండువందల శాతం ఆశ్చర్యపోతాం. ఇంత అద్భుతంగా ఎవరు చెక్కారా అని అవాక్కవుతాం. ఇలాంటి శిల్పకళ చూడాలి అంటే మనం కర్ణాటక వెళ్లాలి. కర్ణాటకలోని బేలూరు హళేబీడులో నిర్మించిన ఆలయాలు, ఆ ఆలయాల్లో చెక్కిన శిల్పాలు… వాటి సౌందర్యం అద్భుతం అమోఘం. దొర సముద్ర, ద్వారసముద్ర అనబడే రెండు జంట పట్టణాలు. వీటినే మనం ఈనాడు బేలూరు… హళేబీడు అని పిలుస్తున్నాం. ఈ ప్రాంతాన్ని హోయసలలు 1000 నుంచి 1346 వరకు సుమారు 350 సంవత్సరాల కాలం పరిపాలించారు. హోయసలుల కాలంలో ఈ ప్రాంతం ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించింది. ఇక్కడి ఆలయాల్లోని శిల్పసౌందర్యాన్ని చూసినవారెవరైనా శిలలపై శిల్పాలు చెక్కినారు… మనవాళ్లు సృష్టికే అందాలు తెచ్చినారు అని తప్పకుండా పాడుతారనడంలో సందేహం లేదు.
చోళ రాజ్య పరిపాలనో భాగంగా ఉన్న హోయసలలు 1117లో జరిగిన తలకాడ్ యుద్దంలో చోళులని ఓడించి స్వతంత్ర్యం ప్రకటించుకున్నారు. హోయసలుల రాజ్యంతో మొదటి రాజు విష్ణువర్ధనుడు 12వ శతాబ్దంలో రాజ్యాధికారాన్ని చేపట్టాడు. చోళులపై సాధించిన విజయానికి గుర్తుగా చెన్నకేశవ ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఆలయ నిర్మాణంలో విష్ణువర్ధనుడికి ఆయన మంత్రి కేతనమల్లని, శివభక్తుడైన కేసరశెట్టి తోడ్పడినట్టుగా శాసనాలను బట్టి తెలుస్తోంది.
ఆలయ నిర్మాణం అంతా ఒకెత్తైతే… ఆలయంలోని శిల్పచాతుర్యం మరో ఎత్తు. ఆలయంలోని శిల్పాలను చూస్తే … ఎన్ని రాత్రులు నిద్రలు లేకుండా శిల్పాలను చెక్కారో అనిపిస్తుంది. భారతీయ నృత్యశాస్త్రాన్ని అవపోసన పట్టిన వారికే ఇలాంటి శిల్పాలను చెక్కడం సాధ్యమౌతుంది. సామాన్యులకు ఇంతటి సౌందర్యవంతమైన శిల్పాలను చెక్కడం అసాధ్యం. కవులు తమ కవితల్లో వర్ణించినట్టుగా భావ భంగిమలను సుమనోహరంగా అపురూపంగా తీర్చిదిద్దారు. ఈ శిల్పాలను చూస్తే మనం వాటిని శిల్పాలు అని చెప్పలేం. శిల్పంలో వంపులు, సొంపులు… అద్వితీయమైన మెలికలు శిల్పి శిలపై చెక్కడం అసాధ్యం. శిల్పాన్ని అనురాగమూర్తిగా ప్రేమిస్తేనేగాని అంత అద్భుతంగా రాదు. చెన్న కేశవ ఆలయంలోని గర్భగుడి, ముఖద్వారం, నంది బృంగి విగ్రహాలు, ఆలయం లోపలి భాగం, గర్భగుడిలోని పైకప్పు ఇలా చెప్పుకుంటూ పోతే చెన్నకేశవ ఆలయంలోని ప్రతితీ ఓ అద్భుతమే. ఆలయం బయట ఉద్యానవనంలో గోమఠేశ్వరుడి విగ్రహం మరో అద్భుతం.
ఆలయ స్థంభాలను పైకప్పును కలుపుతూ ఏటవాలుగా ఉండే దర్పణ సుందరి, వికటనర్తకి, రసికశబరి, మయూరశిఖే శిల్పాలు చూపుతిప్పుకోనివ్వవు. వీటితో పాటు ఆలయం గోడలపై చెక్కిన రామాయణ, దశావతార, వామనావతార శిల్పాలు ఎంతో ప్రత్యేకం. ఈ ఆలయంలో నరసింహస్వామికి సంబంధించి మొత్తం 34 విగ్రహాలు కనువిందు చేస్తాయి. ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క భంగిమలో ఒక్కో చరిత్రను తెలియజేస్తుంది. ఈ 34 విగ్రహాల్లో ఒకటి మనల్ని భయబ్రాంతులకు గురిచేస్తుంది. నరసింహస్వామి ఉగ్రరూపంతో నోరు తెరుచుకొని ఉండగా, నాలుక కదులుతూ ఉంటుంది. శిల్పకళా చరిత్రలో ఇది అద్భుతమనే చెప్పాలి. మనం ఇంత చెప్పుకుంటున్నాం కదా… అసలు ఇంత గొప్ప శిల్పాలను చెక్కింది ఎవరు అనే సందేహం వస్తుంది కదా. శిల్పి అంటే మనకు గుర్తుకు వచ్చేది అమరశిల్పి జక్కన్న. అమరశిల్పి అని ఎందుకు అన్నారంటే…ఆయన చెక్కిన శిల్పాల్లో జీవకళ ఉట్టిపడుతుంది. శిల్పమా లేక నిజమైన రూపమా అన్నట్టుగా ఉంటుంది. ఎంత గొప్ప శిల్పి అయినా ఎక్కడో ఒకచోట పొరపాటు చేయడం సహజమే.
ప్రస్తుతం ఉన్న ఆలయానికి పక్కనే అసంపూర్తిగా నిర్మితమైన ఆలయం ఒకటి మనకు దర్శనం ఇస్తుంది. మొదట ఇక్కడే చెన్నకేశవస్వామిని ప్రతిష్టించాలని అనుకున్నారు. ప్రతిష్ట జరిగే సమయంలో స్వామివారి ఉదరంలో కప్ప ఉందని జక్కన్న కుమారు డంకనాచార్యుడు చెబుతారు. జక్కన్న నిరూపించాలని సవాల్ విసురుతాడు. వెంటనే విగ్రహం ఉదరాన్ని పడలగొట్టగా అందులోనుంచి కప్ప బయటకు వస్తుంది. తాను తప్పుచేశానని, తప్పుచేసిన దానికి దండనగా కుడిచేతిని స్వామివారికి సమర్పిస్తున్నానని చెప్పి చేతిని నరికేసుకుంటాడు. ఆ పక్కనే ప్రస్తుతం ఇప్పుడున్న ఆలయానని నిర్మించారు. సజీవత్వంతో కూడిన శిల్పాలున్న ఆదేశాన్ని వదిలేసి ఎక్కడికెక్కడికో వెళ్లి అక్కడివాటిని ప్రచారం చేస్తున్నాం. ఇంతకన్నా దురదృష్టం ఇంకొకటి ఉంటుందా చెప్పండి.