మెట్ట ప్రాంతాల్లో, చేను గట్లపైన మనకు ఎర్రని కాయలుండే చెట్లు కనిపిస్తుంటాయి. సంతలకు వెళ్తే కుప్పలు కుప్పలుగా పోసి అమ్ముతుంటారు. చిన్న పరిమాణంలో ఆకుపచ్చ, ఎరుపు రంగు మిశ్రమంలో మనకు కనిపిస్తుంటాయి. వాటిని ఏమంటారో తెలుసా… వాక్కాయలు అంటాం. రుచికి కాస్త వగరుగాను, మరికాస్త పులుపుగానూ ఉంటాయి. ఈ వాక్కాయలు వగరుగా ఉన్నప్పటికీ… ఆరోగ్యపరంగా ఎన్నో ఔషధగుణాలను కలిగి ఉన్నాయనడంలో ఆశ్చర్యం లేదు. వీటిని పండ్లరూపంలోనూ, పచ్చళ్ల రూపంలోనూ తీసుకుంటూ ఉంటారు. ఈ కాయలను వివిధ ప్రాంతాల్లో వివిధరకాలైన పేర్లతో పిలుస్తుంటారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో వీటిని వాక్కాయలు అంటే దక్షిణ తెలంగాణలో కలింపండ్లు, కలేక్కాయ అని పిలుస్తారు. అటు ఆంధ్రప్రాంతంలోనూ వీటిని కలేక్కాయలుగా పిలుస్తారు.
కిల్లీకాయలు
మనం పాన్ షాపుకు వెల్లి కిల్లీ కట్టించుకున్నప్పుడు కిల్లీమీద ఎరుపు రంగులో ఉండే పండును గుచ్చి ఇస్తాడు. మనం దానిని చెర్రీ అనుకుంటాం కదా. కానీ, అది చెర్రీపండు కాదు. కలేక్కాయ. బాగా పండిన తరువాత కలేక్కాయను ఇలా వాడతారు. అంటేకాదు, ఈ కాయలను ఎండబెట్టి టూటీ ఫ్రూటీ గా కూడా వినియోగిస్తారు. కేకులు, సలాడ్స్‌పై రంగు రంగులతో కనిపించే మిశ్రమం కలేక్కాయలే. చాలా ప్రాంతాల్లో చింతపండుకు బదులుగా కలేక్కాయలను ఆహారపదార్థాల్లో వినియోగిస్తుంటారు. రోటి పచ్చళ్ల తయారీలో వీటిని ఎక్కువగా వినియోగిస్తారు. ఆవకాయ, పచ్చిమిర్చితో కలిపి నిల్వపచ్చడిగా కూడా కలేక్కాయలను వినియోగించుకోవచ్చు.
చేను గట్లపై కంచెలు
ఈ చెట్లను ఎక్కువగా చేను గట్లపై పెంచుతుంటారు. ఈ చెట్లకు ముళ్లు ఉంటాయి కాబట్టి కంచె మాదిరిగా ఉపయోగపడుతుంది. జంతువులు, పశువులు పొలంలోకి, తోటలోకి రాకుండా వీటిని పెంచుతారు. వర్షాకాలంలోనే ఎక్కువగా ఈ పండ్లు పక్వానికి వస్తాయి. వర్షాకాలంలో లభించే ఈ పండ్లతో తయారు చేసే వివిధ పదార్ధాలతో చాలా మంది రైతులు అదనపు ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. ఇప్పుడు మనం ఆరోగ్య రహస్యాలను తెలుసుకుందాం.
ఆరోగ్యంలో వాక్కాయ
వాక్కాయ లేదా కలేక్కాయల్లో విటమిన్ బి, సి, ఐరన్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో కీలకపాత్రను పోషిస్తాయి. ఇక కలేక్కాయల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపు ఉబ్బరాన్ని అడ్డుకొని అజీర్తి సమస్యకు మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. అంతేకాదు, ఈ పండ్లలోని పెక్టిన్ అనే కార్బోహైడ్రేడ్ జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి ఆకలిని పెంచుతుంది. మెదడు ఆలోచనను, పనితీరును కూడా వాక్కాయలు మెరుగుపరుస్తాయి. ఈ కాయల్లో ఉండే విటమిన్స్‌తో పాటు ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ సెరటోనిన్‌ను ఉత్పత్తి చేయడం వలన ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులోని పోషకాలు కాలేయాన్ని, రక్తాన్ని శుద్ది చేయడంతో పాటు శరీరంలోని కొవ్వు నిల్వలు పేరుకుపోకుండా సహకరిస్తాయి.