పవన్‌ వీరాభిమాని మృతి.. 

Pawan Kalyan Fan Niranjan Dies

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వీరాభిమాని పొనుగంటి నిరంజన్ (17) అకాల మృతి చెందారు. స్థానికంగా అందరూ ‘చోటా గబ్బర్ సింగ్’ అని పిలుచుకునే నిరంజన్, గత కొంతకాలంగా అరుదైన జన్యుపరమైన అనారోగ్యంతో పాటు కిడ్నీ వ్యాధితో బాధపడుతూ హనుమకొండలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. గత నెలలోనే పవన్ కల్యాణ్ స్వయంగా నిరంజన్ ఇంటికి వచ్చి, భవిష్యత్తులో ఇద్దరం కలిసి సినిమా చూద్దామని ఇచ్చిన మాట.. అంతలోనే ఇలా కోరికగానే మిగిలిపోవడం స్థానికులను తీవ్రంగా కలచివేస్తోంది.

తీరని ‘ఓజీ-2’ సినిమా కోరిక
పుట్టుకతోనే వచ్చిన తీవ్ర అనారోగ్యం కారణంగా నిరంజన్ దాదాపు 17 ఏళ్లు మంచానికే పరిమితమయ్యారు. అయితే, ఆయన గుండెల్లో పవన్ కల్యాణ్ పట్ల ఉన్న అభిమానం మాత్రం ఎప్పుడూ తగ్గలేదు. మంచంపై పడుకునే ఆయన చేసిన గబ్బర్ సింగ్ డాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ విషయాన్ని గమనించిన జనసేన కార్యకర్తలు పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లగా, గత నెలలో పవన్ స్వయంగా హనుమకొండలోని నిరంజన్ చిన్న ఇంటికి విచ్చేశారు. నిరంజన్‌ను గుండెలకు హత్తుకుని, త్వరలోనే కోలుకుంటావని ధైర్యం చెప్పారు. అంతేకాదు, “నువ్వు త్వరగా కోలుకో.. మనం ఇద్దరం కలిసి ‘ఓజీ-2’ సినిమా చూద్దాం, నీకోసం ప్రత్యేక షో వేయిస్తా” అని పవన్ కల్యాణ్ ఆ నిమిషంలో హామీ ఇచ్చారు.

విషాదంలో కుటుంబం
ఆరోగ్యం మెరుగవుతుందని ఆశించిన కుటుంబ సభ్యులకు నిరంజన్ అకస్మాత్తుగా మరణించడం పెద్ద దిగ్భ్రాంతిని మిగిల్చింది. నిరంజన్ మృతి వార్త తెలిసిన వెంటనే జనసేన శ్రేణులు, స్థానిక నాయకులు ఆయన నివాసానికి చేరుకుని నివాళులర్పించారు. పవన్ కల్యాణ్ ఇచ్చిన ఆత్మీయమైన మాటను గుండెల్లో పెట్టుకుని, ఆ ‘స్పెషల్ షో’ కోసం ఎదురుచూసిన ఆ కళ్లు శాశ్వతంగా మూతపడటం అభిమానుల కంటతడి పెట్టిస్తోంది. ఒక సామాన్య అభిమాని కోసం అంత పెద్ద నాయకుడు తరలివచ్చిన ఆ మధుర జ్ఞాపకం ఇప్పుడు ఆ కుటుంబానికి గుండెకోతగా మిగిలింది.

Also Read  తిరుపతిలో భారీ బహిరంగ సభ…కూటమి సర్కార్‌పై నమ్మకం పెంచేందుకేనా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *