పంజాబ్‌కు చెందినప్పటికీ, తెలుగుసినిమా రంగంలోనే తన కెరీర్‌ను నిర్మించుకున్న నటి పూనమ్ కౌర్ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సంచలన విషయాలను బయటపెట్టారు. సినిమాల్లో అవకాశాలు తగ్గిన తర్వాత కూడా హైదరాబాద్‌లోనే ఉండాలని తాను నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు.
గత కొన్ని సంవత్సరాలుగా, కొంతమంది సినీ ప్రముఖులపై ఆమె సోషల్ మీడియాలో చేసిన వ్యంగ్య వ్యాఖ్యల కారణంగా పూనమ్ పేరు రాజకీయ చర్చల్లోకి తరచూ వచ్చింది. ఇప్పుడు తొలిసారిగా, రాజకీయ వర్గాల నుంచి తనపై వచ్చిన ఒత్తిళ్లు, బెదిరింపుల గురించి ఆమె బహిరంగంగా మాట్లాడారు.
ఒక సందర్భంలో కడప నుంచి వచ్చిన కొందరు వ్యక్తులు తనను కలిశారని, ఒక నిర్దిష్ట నటుడిపై మాట్లాడేలా ప్రెస్‌మీట్ పెట్టాలని బెదిరించారని పూనమ్ ఆరోపించారు. మొదట డబ్బుతో ప్రలోభపెట్టారని, ఆ తర్వాత రాజకీయ పదవి ఇస్తామని కూడా చెప్పారని ఆమె తెలిపారు. అయితే వాటన్నింటినీ తాను తిరస్కరించడంతో, తనను బలవంతం చేయడానికి న్యూడ్ వీడియోలు లీక్ చేస్తామని బెదిరించారని పూనమ్ చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని ఇప్పటివరకు ఎప్పుడూ బయటకు చెప్పలేదని, ఆ బాధను తనలోనే దాచుకుని కుటుంబ సభ్యులతో మాత్రమే పంచుకున్నానని ఆమె భావోద్వేగంగా వెల్లడించారు.
అలాగే, మాజీ వైఎస్సార్సీపీ నేత పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యల వల్ల తన వ్యక్తిగత జీవితం తీవ్రంగా దెబ్బతిందని పూనమ్ అన్నారు. ఆ సమయంలో తాను వివాహం గురించి ఆలోచిస్తున్నానని, కానీ ప్రెస్‌మీట్ తరువాత ఏర్పడిన వివాదాలతో తన జీవితం పూర్తిగా మలుపు తిరిగిందని చెప్పారు. వ్యక్తిగతంగా ఎన్నో కోల్పోయానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభావం తన సినీ కెరీర్‌ను దాటి, జీవితమంతా వెంటాడిందని పూనమ్ ఆవేదనతో తెలిపారు.