ఈశాన్య భారతాన్ని వరుస భూకంపాలు వణికించాయి. గంటల వ్యవధిలో త్రిపుర, అస్సాం రాష్ట్రాల్లో భూకంపాలు సంభవించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించిన వివరాల ప్రకారం, సోమవారం జనవరి 5 తెల్లవారుజామున అస్సాంలోని మోరిగావ్ ప్రాంతంలో రిక్టర్ స్కేల్‌పై 5.1 తీవ్రతతో భూకంపం నమోదైంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 4 గంటల 17 నిమిషాలకు ఈ ప్రకంపనలు చోటుచేసుకోగా, భూకంప కేంద్రం భూమికి 50 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. తెల్లవారుజామున అకస్మాత్తుగా భూమి కంపించడంతో ప్రజలు నిద్రలేచి భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
గౌహతి సహా సెంట్రల్ అస్సాంలోని పలు ప్రాంతాల్లో ఐదు సెకన్ల పాటు ప్రకంపనలు కొనసాగినట్లు స్థానికులు తెలిపారు. సోషల్ మీడియాలోనూ భూకంప అనుభవాలను నెటిజన్లు పంచుకున్నారు. అదృష్టవశాత్తూ ఈ భూకంపం వల్ల ఇప్పటివరకు ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, అస్సాం భూకంపానికి కొన్ని గంటల ముందే త్రిపుర రాష్ట్రంలోని గోమతి జిల్లాలో 3.9 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. ఉదయం 3 గంటల 33 నిమిషాలకు నమోదైన ఈ భూకంపం భూమికి 54 కిలోమీటర్ల లోతులో ఏర్పడినట్లు సీస్మోలజీ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం పరిస్థితిని అధికారులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.