అమెరికా రాజకీయ వర్గాల్లో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు గ్లోబల్ మార్కెట్లను కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్‌పై క్రిమినల్ దర్యాప్తుకు సంబంధించి వస్తున్న వార్తలు స్టాక్ మార్కెట్లలో అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. ఫెడరల్ రిజర్వ్ వంటి అత్యంత స్వతంత్ర సంస్థపై ఈ తరహా విచారణలు జరగడం పెట్టుబడిదారుల్లో ఆందోళనను పెంచుతోంది. ఈ దర్యాప్తు వెనుక రాజకీయ ఒత్తిడి ఉందని పావెల్ బహిరంగంగా వ్యాఖ్యానించడంతో ఈ వ్యవహారం మరింత సంచలనంగా మారింది.
వడ్డీ రేట్ల విషయంలో దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చానని, రాజకీయ ఆదేశాలకు లోబడలేదనే కారణంతోనే తనపై ఈ చర్యలు తీసుకుంటున్నారని పావెల్ ఆరోపిస్తున్నారు. ఈ పరిణామాలతో అమెరికా స్టాక్ మార్కెట్లలో తీవ్ర ఊగిసలాట కనిపిస్తోంది. పెట్టుబడిదారులు రిస్క్ తీసుకోవడానికి వెనుకాడుతూ ఈక్విటీ మార్కెట్ల నుంచి నెమ్మదిగా బయటకు వస్తున్నారు.
దీని ప్రత్యక్ష ప్రభావం బంగారం ధరలపై పడుతోంది. అనిశ్చిత పరిస్థితుల్లో భద్రమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 4600 డాలర్లను దాటి చరిత్ర సృష్టించింది. దేశీయంగా కూడా 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1.43 లక్షలకుపైగా చేరి ఆల్‌టైం రికార్డు స్థాయికి చేరింది. ప్రస్తుత పరిస్థితులు కొనసాగితే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.