మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎంత హుందాగా ఉంటాడో తెలిసిందే కదా… అలానే లాస్ట్ ఇయర్ జరిగిన సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ తరవాత ఇంకా జాగ్రత్తగా ఉంటున్నాడు… ఐతే ఈ రోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఓ వివాదం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఒక బ్రాండ్ స్ట్రాటజిస్ట్ విడుదల చేసిన వీడియో వైరల్ అవుతూ, పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ వీడియోలో అల్లు అర్జున్ను వ్యక్తిగతంగా కలవడం చాలా కష్టమని, ఆయనను కలవాలంటే దాదాపు 42 నియమాలు పాటించాల్సి ఉంటుందని ఆమె పేర్కొన్నట్లు ప్రచారం జరిగింది. ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో నెట్టింట ఒక్కసారిగా చర్చలు మొదలయ్యాయి.
వీడియో వైరల్ కావడంతో సెలబ్రిటీ కల్చర్ హద్దులు దాటిందా? లేక ఇది కేవలం ప్రమోషన్ ఆ అనే దానిపై నెటిజన్లు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొందరు స్టార్ల చుట్టూ ఏర్పడుతున్న ప్రోటోకాల్స్‌పై ప్రశ్నలు లేవనెత్తగా, మరికొందరు అల్లు అర్జున్ అభిమానులు మాత్రం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. అవి పూర్తిగా అసత్యం, నిరాధారమని పేర్కొంటూ సోషల్ మీడియాలో బలంగా స్పందించారు.
ఈ వివాదంపై వెంటనే స్పందించిన అల్లు అర్జున్ టీమ్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆ వీడియోలో చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధమని, వాస్తవాలకు ఏమాత్రం సంబంధం లేదని స్పష్టం చేసింది. అల్లు అర్జున్ ఎప్పుడూ గౌరవప్రదంగా, వినయంగా వ్యవహరించే వ్యక్తి అని కూడా పేర్కొంది. అంతేకాకుండా, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. ఎవరూ ధృవీకరించని వార్తలను పంచుకోవద్దని ప్రజలను విజ్ఞప్తి చేసింది.
బన్నీ టీమ్ కఠిన హెచ్చరికల తర్వాత ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఆ వీడియో ప్రసారం చేసిన పోడ్కాస్ట్ ఛానల్ అడ్మిన్ వీడియోను తొలగించినట్లు ప్రకటించారు. తన గెస్ట్‌కు బెదిరింపులు, సమన్వయంగా జరుగుతున్న ఆన్లైన్ వేధింపులు ఎదురవుతున్నాయని ఆమె ఆరోపించారు. ఆ గెస్ట్ ఒక ప్రతిష్టాత్మక సంస్థలో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారని, ఈ వివాదం వల్ల ఆమె కెరీర్‌కు నష్టం కలగకూడదనే ఉద్దేశంతో వీడియోను తీసివేశామని చెప్పారు.
అయితే అదే సమయంలో, ఆ చర్చలో చెప్పిన విషయాలు వాస్తవాలపై ఆధారపడినవేనని, అవి అపకీర్తి పరచే ఉద్దేశంతో చేసినవి కావని అడ్మిన్ స్పష్టం చేశారు. నిజమైన వ్యక్తిని రక్షించడం తనకు అత్యంత ప్రాధాన్యం అని పేర్కొంటూనే, అల్లు అర్జున్ ఇంకా ఆయన టీమ్ అధికార దుర్వినియోగం చేస్తున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ఈ వివాదం మరింత వేడెక్కింది.