తెలుగు సినీ చరిత్రలో అత్యంత వివాదాస్పదంగా చర్చించబడిన సంఘటనల్లో నటి ప్రత్యూష మరణం ఒకటి. అత్యాచారం-హత్య ఆరోపణల మధ్య ఆత్మహత్యగా నమోదైన ఈ కేసులో 23 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. అందుబాటులో ఉన్న ఆధారాల ప్రకారం అత్యాచారం లేదా హత్య జరగలేదని కోర్టు తేల్చి, ప్రత్యూష ప్రియుడు సిద్ధార్థ్ రెడ్డిని ఆత్మహత్యకు ప్రేరేపించిన నేరంలో దోషిగా నిర్ధారించి రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
2002 ఫిబ్రవరి 23న ప్రత్యూష ఇంకా సిద్ధార్థ్ రెడ్డి హైదరాబాద్లోని కేర్ హాస్పిటల్కు విషం తాగి అపరస్మారక స్థితిలో తరలించబడ్డారు. కుటుంబ సభ్యులు వారి ప్రేమ ని వ్యతిరేకించడంతో ఆత్మహత్యకు యత్నించారని అప్పటి కథనం. ఫిబ్రవరి 24న కేవలం 20 ఏళ్ల వయసులో ప్రత్యూష మరణించగా, సిద్ధార్థ్ రెడ్డి ప్రాణాలతో బయటపడ్డాడు.
పోలీసులు దీనిని ఆత్మహత్యగా నమోదు చేసినప్పటికీ, ప్రత్యూష తల్లి సరోజినీ దేవి మాత్రం తన కుమార్తెపై అత్యాచారం చేసి గొంతు నులిమి హత్య చేసిన తర్వాత విషప్రయోగం చేసినట్లు ఆరోపించారు. ఆధారాలను మార్పు చేశారని కూడా ఆమె ఆరోపించారు. కేసు స్టార్టింగ్ లో ఫోరెన్సిక్ నిపుణుడు డా. ముని స్వామి “గొంతు నులిమిన గుర్తులు” ఉన్నాయని చెప్పినా, తర్వాత ఆయన వ్యాఖ్యలు తిరస్కరించబడ్డాయి.
తరువాత స్థానిక కోర్టు సిద్ధార్థ్ రెడ్డికి ఐదేళ్ల జైలు శిక్ష విధించగా, హైకోర్టు దానిని రెండు సంవత్సరాలకు తగ్గించి జరిమానా పెంచింది. చివరకు సుప్రీంకోర్టు హత్య, అత్యాచారం ఆరోపణలను కొట్టివేస్తూ విషప్రయోగమే మరణానికి కారణమని నిర్ధారించింది. ఆత్మహత్యకు ప్రేరేపించిన నేరంలో విధించిన శిక్షను కొనసాగిస్తూ నాలుగు వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది.
ఈ కేసు న్యాయం జరిగిందా లేదా అన్న చర్చలు కొనసాగుతున్నప్పటికీ, ప్రత్యూష తల్లి ఎన్నో సంవత్సరాలుగా కఠిన శిక్ష కోసం పోరాడుతూ వస్తున్నారు. ఈ తీర్పు ఆమెకు నిరాశ కలిగించే అవకాశం ఉంది. ప్రజాభిప్రాయం కూడా మిశ్రమంగా ఉండే అవకాశముంది.