రోడ్డుపై ఏరులై పారిన బీర్లు… ఘాటుతో మండుతున్న నోర్లు

Jhansi Beer Container Accident

ఉత్తర ప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో ఒక వింతైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఝాన్సీ–కాన్పూర్ జాతీయ రహదారిపై వేల సంఖ్యలో బీరు బాటిళ్లతో వెళ్తున్న ఒక భారీ కంటైనర్, ఎదురుగా మిరపకాయల లోడుతో వస్తున్న ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటన నెహ్రూ నగర్ సమీపంలో జరగగా, ప్రమాద తీవ్రతకు రెండు వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. రోడ్డుపై ఒకవైపు కారానికి నిలయమైన మిరపకాయలు, మరోవైపు చల్లని బీరు బాటిళ్లు చెల్లాచెదురుగా పడిపోవడంతో ఆ ప్రాంతమంతా గందరగోళంగా మారింది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది! సాధారణంగా ప్రమాదం జరిగినప్పుడు క్షతగాత్రులను కాపాడటం పోలీసులకు మొదటి ప్రాధాన్యత. కానీ ఇక్కడ బీరు కంటైనర్ పడిపోవడంతో, ఎక్కడ స్థానికులు బాటిళ్లను ఎత్తుకెళ్లిపోతారో అన్న భయంతో పోలీసులు కంటైనర్ చుట్టూ ‘రక్షణ వలయం’లా ఏర్పడాల్సి వచ్చింది.

ఒకవైపు మిరపకాయల ఘాటు ముక్కుపుటాలదిరుస్తుంటే, మరోవైపు ఆ ‘లిక్విడ్ గోల్డ్’ (బీరు)ను కాపాడటం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. ఒక్క బాటిల్ కూడా బయటకు పోకుండా పోలీసులు పహారా కాస్తున్న దృశ్యాలు చూసి వాహనదారులు విస్తుపోయారు. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు తీవ్రంగా గాయపడగా, వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు కానీ, గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. భారీ క్రేన్ల సహాయంతో వాహనాలను తొలగించి రోడ్డును క్లియర్ చేశారు. ఏదేమైనా, ఈ ‘బీరు-మిర్చి’ కాంబినేషన్ ప్రమాదం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *