భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న హోంబలే ఫిల్మ్స్, పురాణ గాథలను వెండితెరపై విజువల్ వండర్‌గా ఆవిష్కరించే పనిలో పడింది. గతేడాది ‘మహావతార్ నరసింహ’తో యానిమేషన్ ప్రపంచంలో రూ. 300 కోట్ల సునామీ సృష్టించిన ఈ సంస్థ, ఇప్పుడు ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’ నుండి రెండో కానుకను ప్రకటించింది. పరశురామ జయంతి సందర్భంగా ‘మహా అవతార్: పరశురామ్’ టైటిల్ పోస్టర్, గ్లింప్స్‌ను విడుదల చేసి ప్రేక్షకుల్లో అంచనాలను ఆకాశానికి చేర్చింది.
విజువల్ ట్రీట్: గ్రాఫిక్స్ అదిరిపోయాయి!
దర్శకుడు అశ్విన్ కుమార్ రూపొందించిన ఈ గ్లింప్స్ చూస్తుంటే, హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ (VFX) కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నాయి. “ధర్మం పతనమైనప్పుడు పరశురాముడు ఉద్భవిస్తాడు” అనే పవర్ఫుల్ క్యాప్షన్‌తో ఈ సినిమా వస్తోంది. అక్రమార్కులైన రాజులను తుదముట్టించేందుకు 21 సార్లు భూమిని ప్రక్షాళన చేసిన భార్గవ రాముడి పరాక్రమాన్ని ఇందులో చూపించనున్నారు. యానిమేటెడ్ ఫార్మాట్లో రూపొందుతున్నప్పటికీ, పాత్రల రూపకల్పన, యుద్ధ భూమి నేపథ్యం ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు.
మహావతార్ యూనివర్స్ – ఒక ఆధ్యాత్మిక ప్రయాణం
శ్రీ మహావిష్ణువు దశావతారాల ఆధారంగా మొత్తం 7 సినిమాలు ఈ యూనివర్స్‌లో రానున్నాయి. 2025లో విడుదలై భారత్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటెడ్ సినిమాగా రూ. 300 కోట్లు కొల్లగొట్టింది మహావతార్ నరసింహా సినిమా. ఇక మహా అవతార్ పరశురామ్ 2027 డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దశావతారాల్లోని ఇతర ముఖ్యమైన సినిమాలు ఒకదాని తరువాత ఒకటిగా విడుదల కానున్నాయి.
హోంబలే ఫిల్మ్స్.. సక్సెస్‌కు కేరాఫ్ అడ్రస్!
కేజీఎఫ్ 2తో రూ. 1000 కోట్లు, సలార్, కాంతార వంటి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించిన హోంబలే ఫిల్మ్స్, ఇప్పుడు ఆధ్యాత్మిక కథలను నేటి తరం టెక్నాలజీతో జోడించి ప్రపంచ స్థాయికి తీసుకెళ్తోంది. కేవలం భారీ బడ్జెట్ లైవ్-యాక్షన్ సినిమాలే కాకుండా, యానిమేషన్ రంగంలో కూడా భారత్ సత్తా చాటాలని ఈ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. అత్యాధునిక సాంకేతికతతో మన పురాణ పురుషుల కథలను చూడటం నిజంగా ఒక అద్భుతమైన అనుభూతి. 2027 డిసెంబర్లో విడుదల కానున్న ఈ పరశురాముడి యుద్ధం ఇంకెన్ని రికార్డులను తుడిచిపెట్టేస్తుందో వేచి చూడాలి!